‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానం’ అని పండిత సూక్తి. శ్రద్ధ వల్లనే జ్ఞానం లభిస్తుందని అర్థం. పిల్లలకు చదువు రావట్లేదు అంటే, కిందకి పరీక్షల్లో కంటే మార్కులు తగ్గినాయంటే, హోం వర్క్ అసైన్‌మెంట్ హ్యాండ్ రైటింగ్ ఏదీ సరిగ్గా చేయట్లేదంటే, ఆకతాయిలతో జట్టు కడుతున్నారంటే, ఆగమాగం అవుతున్నారంటే, అటు పేరెంట్సూ ఇటు టీచర్సూ ముక్తకంఠంతో వ్యక్తం చేసే అసహనం ‘పోరల్లో శ్రద్ధ చచ్చింది, వీళ్లు బాగుపడరు’ అనే. శ్రద్ధ ఉంటేనే కదా! అది లేకుండాపోయింది లేదా క్షీణించిందనేది నా అభిప్రాయం. అందుకే తల్లిదండ్రులతో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులతో యాజమాన్యాలతో నేను గట్టిగా మొరపెట్టుకునేదేమంటే బాలబాలికల్లో అందరికీ సమానంగా ఉండకపోవచ్చు, వాళ్లు శ్రద్ధను కోల్పోవచ్చు, కానీ శ్రద్ధ లేకుండా ఎవరూ ఉండరు, శ్రద్ధ చావదు అని. మరి, శ్రద్ధ ఎందుకు కోల్పోతున్నారో, శ్రద్ధ ఎందుకు లేకుండాపోతుందో మనం క్షుణ్ణంగా మాట్లాడుకోవాల్సివుంది. ఎందుకంటే శ్రద్ధ ఏకాగ్రత సావధానత పేరేదైనా ఆ సద్గుణం లోపిస్తే చదువొక్కటే కాదు, ఏ పనీరాదు, చేయలేం.
వైఫై సౌకర్యంతో సోషల్ మీడియా, బతుకుల్లోకి వెల్లువలా చొచ్చుకొచ్చిన ఆధునికత తాలూకు అనేక విషమాంశాలు పిల్లల ఏకాగ్రత మీదా, అవగాహనా సామర్థ్యం మీదా గొడ్డలి పెట్టుగా మారాయి. ఇంతకు ముందు నలభై, యాభై నిమిషాల పాటు తధేకంగా పాఠం విన్న విద్యార్థులు ఇప్పుడు క్లాసులో నాలుగైదు నిమిషాలు కూడా నిలకడగా కూర్చోలేకపోతున్నారు. ఏకాగ్రత, నిమగ్నత, కార్యోన్ముఖత పూర్తిగా దెబ్బతిని విద్యకు ఆవలి ప్రతికూల ప్రభావాల ( Negative Associations) వైపు పడిపోతున్నారు. జీవితానికి అత్యవసరమైన చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆసక్తి మచ్చుకైనాలేని మందబుద్ధులుగా మారుతున్నారు. పిల్లల్లో శ్రద్ధ చచ్చిపోయిందనే తీవ్ర దూషణకూ కారణం అవుతున్నారు. అత్యంత గొప్పకాలాన్ని విలువల క్షీణయుగంగా ఇచ్ఛకొద్ది మార్చేస్తున్నారు. ప్రముఖ రచయిత్రి బ్రియన్నా వీస్ట్ చెబుతున్నట్టు నైపుణ్యాల దిశను వీడి స్వీయ విధ్వంసం వైపుకు పిల్లలు వాలిపోతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితిలో పెద్ద వాళ్లంగా మనం చేయగలిగింది, చేయాల్సింది, చేయించగలగింది చేస్తే తిరిగి వాళ్ల శ్రద్ధను వాళ్లు పొందగలిగేలా ఏకాగ్రతను పునరుద్ధరించుకుంటారనేది నాకున్న విశ్వాసం, బలమైన నమ్మకం.
మానసిక శాస్త్ర నిపుణులు సైతం ఇదే చెబుతున్నారు. ప్రపంచీకరణ అనంతర పరిణామాల నేపథ్యంలో విద్యా దృక్పథం మారిన సంగతి మనకు తెలిసిందే. బట్టీ కొట్టేదో జ్ఞాపకం పెట్టుకుని పరీక్షల్లో జవాబుల రూపంలో వాంతి చేసుకొని మరచిపోయేదో కాదు విద్య, ఆగామి నాయకులను, ఆలోచనా బృందాలను, మేధో ప్రచారకులను విద్య సమాజానికి అందించాల్సి వుంది. నూతన జాతీయ విద్యా విధానం ఘోషిస్తున్నట్టు సమాజ పరివర్తన (Social Transition), సమాజ రూపాంతరం (Social Transfer mation)రెండూ విద్య ద్వారా జరగాల్సిన మహోన్నత కార్యక్రమాలు. ఏ శ్రద్ధాలేని కొత్తతరంతో ‘పరివర్తన, రూపాంతరం’ వంటి తాత్విక భావనలు, అవి నెరవేర్చే సమాజ నిర్మాణం ఎట్లా సాధ్యమవుతుందనేదే చిక్కు ప్రశ్న. ప్రసార మాధ్యమాల పరంగా ఇది ఫ్లాషీ వీడియోల, అంతంలేని నోటిఫికేషన్ల యుగం. శ్రద్ధ గురించి ఇప్పుడు యువత ఆందోళన చెందడంలేదని చెప్పలేం. ఒక్కో తరగతిపైకి వెళ్తున్నకొద్దీ ఇవాళ్టి పిల్లల్లో ఆందోళన మరింత హెచ్చుతుంది. తీవ్రమైన శ్రద్ధా సంక్షోభంలో తాము ఎందుకు జీవిస్తున్నామనే విషయంలో యువత మరింత చికాకుపడుతున్నారు.
శ్రద్ధా పునరుద్ధరణకై పూనుకున్న యువకులు చెపుతున్నదేమంటే- తమ మెదడు ఒక పని నుండి మరొక పనికి మారినప్పుడు మనోవ్యవస్థను పునర్నిర్మించవలసి వస్తుందని, ఇంతకు ముందు ఏం చేశామో గుర్తుంచుకోవాలి, అదే పని గురించి ఏమనుకున్నామో గుర్తుంచుకోవాలి. ఈక్రమంలో పనితీరు బలహీనపడుతుంది. వేగం స్తంభిస్తుంది. ఆన్‌స్క్రీన్ ఒకదాంట్లోంచి మరొక ప్లాట్ ఫాంకు మారడం మూలంగా తదుపరి అవసరమైన పని ఆగిపోతుంది. ఏం తోచదు అంటున్నారు టీనేజర్స్. దీన్నే ‘స్విచ్-కాస్ట్ ఎఫెక్ట్’ అంటాడు జోహన్ హారీ. పని చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు టెకస్ట్‌లను, వీడియోలను తనిఖీ చేస్తే, టెకస్ట్‌లను, వీడియోలను చూడటం కోసం వెచ్చించే కొద్దిపాటి సమయాన్ని మాత్రమే కోల్పోం. తదుపరి పనిపై దృష్టి కేంద్రీకరించడానికి పట్టే సమయాన్ని కూడా కోల్పోతున్నామనేదే విద్యార్థుల ఆందోళన. విద్య పట్ల శ్రద్ధ, విషయాసక్తి సన్నగిల్లుతున్న పరిస్థితిని మసాచుసెట్స్ యునివర్సిటీ న్యూరోసైంటిస్ట్ ప్రొఫెసర్ ఎర్ల్ మిల్లర్’అభిజ్ఞా క్షీణతా నికర తుఫాను (A perfect storm of cognitive degradation)’గా అభివర్ణించాడు. అందుకే ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగల్ దేశాల్లో పాఠశాల ఆవరణల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించారు.
బ్రిటన్ కూడా ఇదే నిర్ణయం తీసుకోనుంది. మిగతా దేశాలు యూరపునే అనుసరించనున్నట్టు సమాచారం.పిల్లల్నీ పెద్దల్నీ చదువుల్లోనే కాదు, ప్రతి చోట ప్రతి పనిలో ఏదో రకంగా శ్రద్ధాసక్తులకు దూరంగా కొనిపోతున్న ఈ విద్యున్మాధ్యమ ప్రసారికలను నిషేధించాలా? నియంత్రించాలా? అనే విషయంలో మీడియా నిపుణులు ‘నియంత్రణ’ కే తమ సమ్మతి తెలుపుతున్నారు. ఏకాగ్రతను శ్రద్ధాసక్తులు పెంపుదలకు విద్యాలయాలు ఏం చేయాలి? పిల్లలకు ఏరకమైన మద్దతు ఇవ్వగలం? అనే సూటి ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రముఖ పాత్రికేయులు మేఘా చతుర్వేది ‘విద్యాసమాచారంతో అనుసంధానం (Engaging Informa tion), బైట్-సైజ్ లెర్నింగ్‌ని (Implementing Bite-Size Learning) అమలు చేయడం, ట్రిగ్గర్‌లను గుర్తించడం (Identifying Triggers), అవధాన పూర్వక ప్రణాళికా వ్యూహాలు పాటించడం (Plann ing Attention Strategies), డికంప్రెషన్ పాజ్‌ల అమలు (Decompression pauses), నానో లెర్నింగ్ (Nano Learning) వంటి పద్ధతుల్లో శ్రద్ధాసక్తులను రగిలించవచ్చు’ అంటారు. అమెరికాలోని ఒరెగాన్ హెల్త్ & సైన్స్ యూనివర్శిటీ (OHSU) ప్రొఫెసర్ జోయెల్ టి నిగ్ చెపుతున్న దాన్ని బట్టి చూస్తే శ్రద్ధాసక్తుల కొరత పిల్లల్ని పోనుపోను ‘శ్రద్ధా పూర్వక వ్యాధి కారక సంస్కృతి (Attentional pathogenic culture)’ లోకి నెట్టే ప్రమాదం పొంచి వుందనిపిస్తుంది.
ఈ ప్రమాదాన్ని అధిగమించే కాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్ మిహాలీ విద్యార్థుల ‘ఆనందమయ స్థితులు (Flow states)’ గురించి సానుకూల మనస్తత్వశాస్త్ర రంగంలో నలభై సంవత్సరాలకు పైగా పరిశోధన చేస్తున్నాడు. శ్రద్ధా పునరుద్ధరణకై ఈయన యువతకు చిట్కా ఇస్తూ- ‘పిల్లలూ! అనవసరాల ఆన్‌స్క్రీన్ కలాపాలకు స్వస్తిపలికి మీరు ప్రవహించాల్సిన చోట్లు మూడున్నాయి. వాటిని అనుసరించండి. అవి మొదట మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకోవడం, ఆ లక్ష్యం మీకు అర్థవంతంగా ఉండటం, మీరు చేస్తున్న కార్యక్రమాన్ని మీ సామర్థ్యానికి దాపున ఉంచుకొని అది మీకు సహాయపడేలా చూసుకోవడం- ఎట్లా అంటే మీరు ఎక్కే మెట్టు, మీరు ఎక్కిన చివరి మెట్టు కంటే కొంచెం ఎత్తుగా గట్టిగా ఉండటం’ అన్నాడు. చదువుల్లో రాణించాలన్న లక్ష్యం ఉంటే చాలు, తిరిగి ‘వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం’ ఆరంభిస్తారు. ఇవే పిల్లలకు ఆలోచనలనిస్తాయి, విశ్లేషణకు పదునుపెడతాయి.