నీటి అడుగున పురాతన ద్వారకలో పూజాదికాలు
ప్రధాని మోడీ మరో సాహసం చేశారు. ద్వారకాలో తీగల వంతెన ప్రారంభానికి వచ్చిన సందర్భంగా ఆయన పురాతన ఆధ్యాత్మిక నగరం ద్వారకాను సందర్శించారు. ఇందుకు మోడీ స్కూబా డైవింగ్ చేశారు. సముద్ర గర్భంలో నిక్షిప్తం అయిన శ్రీకృష్ణుడి మహానగరాన్ని సందర్శించారు. అక్కడ పూజలు నిర్వహించారు. గుజరాత్ తీరం వెంబడి పంచ్‌కుమి బీచ్ వద్ద ఆయన స్కూబా డైవింగ్‌లో భాగంగా ఆయన ఇందుకు అవసరం అయిన ప్రత్యేక డ్రస్సు వేసుకున్నారు. పురాతన నగరం అవశేషాలను వీక్షించారు.
సముద్ర గర్భంలో ఉన్న ద్వారకాస్వామిని సందర్శించడం జల సాహసమే అవుతుంది. ఈ సాహసం కూడా ఆయన ఇప్పుడు పూర్తి చేశారు. సముద్ర గర్భంలో తాను ఉన్నప్పటి, పూజలు నిర్వహిస్తున్నప్పటి ఫోటోలు సామాజిక మాధ్యమాలలో పెట్టారు. ఇదో దివ్యానుభూతి, కాలతీత శక్తి అనుభూతిని భక్తిభావనతో అనుభవించాను. శ్రీకృష్ణుడు సకల జనులను అనుగ్రహిస్తాడు అని వ్యాఖ్యానించారు. తాను చేసింది సాహసం కంటే ,పెంచుకున్న విశ్వాసం అని అనుకోవల్సి వస్తుందని మోడీ స్పందించారు. ద్వారకా నగరం విశిష్టత తనకు కట్టిపడేసిందన్నారు. సముద్ర గర్భంలోని ద్వారకా వీక్షణంతో తనకు ఈ భారతదేశాన్ని ప్రగతి దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పం మరింత పెరిగిందన్నారు. సముద్రంలోకి వెళ్లేముందు ప్రధాని మోడీ తన వెంబడి నెమలి ఫించం చేతిలో పట్టుకున్నారు.
దీనితోనే సముద్రంలోకి వెళ్లి, అక్కడ శ్రీకృష్ణునికి పూజల దశలో దీనితో వింజామరం వీచారు. ఇతరులు ఎవరూ గుర్తుపట్టని విధంగా స్కూబాడ్రెస్‌లో కన్పించారు. తెల్లటి డైవింగ్ హెల్మెట్, ఒక్రే రోబ్స్ ధరించారు. సముద్ర గర్భంలో ఆయన కాళ్లు ముడుచుకుని ప్రార్థనలు నిర్వహించిన ఫోటోలు వెలువడ్డాయి. ప్రధానికి డైవింగ్ దశలో నౌకాదళానికి చెందిన సుశిక్షిత గజ ఈతగాళ్లు సహకరించారు. సముద్ర గర్భంలోని ఒకప్పటి ద్వారకా నగరం ఇప్పటి ద్వారకా పట్టణానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణంలో అత్యంత ప్రఖ్యాతమైన ద్వారకాధీశ దేవాలయం ఉంది.
సాధారణంగా భక్తులు ఎక్కువగా ఇక్కడికి వచ్చిపోతూంటారు. అతి కొద్ది మంది సముద్ర గర్భంలోని పురాతన ద్వారకా నగరాన్ని తిలకిస్తారు. ఒకప్పటి శ్రీకృష్ణ భగవానుడి కాలానికి ఈ క్షేత్రం, ఈ మహాసముద్రం ప్రత్యక్ష సాక్షంగా ఉంది. చరిత్రలోని కృష్ణ పుటను ఆవిష్కరిస్తుంది. ఇక్కడ వెలిసిన సుదర్శన సేతువుకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది 2.32 కిలోమీటర్ల పొడవుంటుంది. నాలుగు దారులు ఉంటాయి. రూ 979 కోట్లతో దీనిని నిర్మించారు. ఈ బ్రిడ్జిపై 900 మీటర్ల సెంట్రల్ డబుల్ స్పాన్ కేబుల్ స్టే పోర్షన్ ఉంది. 2.45 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు ఉంది. ఇక దీని వెడల్పు 27.20 మీటర్లు. ఇక దీనిపై పాదచారుల నడకకు వీలుగా 2.50 మీటర్ల వెడల్పు ఫుట్‌పాత్‌లు ఉంటాయి.