Saturday, November 23, 2024

బైరెడ్డి కవిత్వంలో మృత్యు స్పృహ

- Advertisement -
- Advertisement -

హృదయ మార్ధవం కవికి ప్రాథమిక లక్షణం. సున్నిత హృదయులకే స్పందించే గుణం ఉంటుంది. అది లేనివారు కవులుగా రాణించలేరు. హృదయ మార్ధవం ఉన్న కవులు రాసిన కవిత్వమే పాఠకుల మనసులను హత్తుకుంటుంది. ఆ కవిత్వంలో పాఠకులు తమ జీవితాలను అనుభూతులను అనుభవాలను దర్శించుకుంటారు. ఎందుకంటే స్పందించే గుణమున్న కవుల కవిత్వం లో తమ అనుభూతిని విశ్వసనీయ భావనగా కవిత్వీకరించగలుగుతారు. సరిగ్గా ఈ కోవలోని వారే ఆర్తి కవి బైరెడ్డి కృష్ణారెడ్డి. తాము చూసిన సన్నివేశం ఇతరులకు చాలా చిన్నదిగా కనిపించినా తాను మాత్రం మానసిక అలజడికి గురవుతారు. తన మనో సంఘర్షణని కవిత్వంగా వ్యక్తీకరిస్తారు. అందరూ చెప్తున్నట్లుగానే వీరి కవిత్వం అక్షరాక్షరంలో ఆర్తి నిండి ఉన్నది. ఈ కవి తన దుఃఖాన్ని దింపుకొనే నెపంతో పాఠకులను దుఃఖంలో ముంచుతుంటారు. వీరి కవిత్వంలో విశ్వ మానవ స్పృహ, మృత్యుస్పృహ స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే వీరు రాసిన ఎలిజీలు కవిత్వ ప్రేమికులను ఆకర్షిస్తాయి. ఉదాహరణకు వీలునామా అనే కవితచూద్దాం.
’మెడల తాళిబొట్టు కాలివేళ్ళ మెట్టెలు /నుదుటి కుంకుమ బొట్టు ముంజేతి గాజులు/నేను పోయిన గాని అమె బతుకంత
నా గురుతుగా తోడుగా కడదాక మిగలాలె/నా పీనుగు సరసన కూలేసి /తోడు అభ్యంగస్నానాలొద్దు/ తెల్ల చీరలు వొద్దు ముండ గాజులు వొద్దు/ నా సరికొత్త వీలునామా మీదొట్టు
నా తోడైన నీడకు నా రుణమిట్ల తీరాలె’/ చావు తరువాత కుటుంబ సభ్యులకు ఓదార్పు వచనాలు ఈ కవిత్వంలో కనిపిస్తాయి. సంస్కరణ దృక్పథము కనిపిస్తుంది. భర్త చనిపోయినప్పుడు భార్యను విధవరాలుగా చేసే సమయంలో ఉండే దుఃఖము ధ్వనిస్తుంది.
ఇటీవల కృష్ణారెడ్డి గారు అమెరికాలో పర్యటిస్తున్న సందర్భంగా థామస్ గ్రే రాసిన కంట్రీ చర్చి యార్డ్ కవితను తెలుగులోనికి అనువదించిన విషయం విధితమే. ఈ కవిత అనువాద కవితగా కాక ఒక స్వతంత్ర కవితగా గోచరిస్తున్నది. ఇక్కడి చావు సంప్రదాయాలను స్పృశిస్తూ స్వేచ్ఛనువాదం చేశారు. ఇందులోనూ మృత్యుస్పృహ ఉన్నది.
‘నూకలిక్కడ చెల్లెనా తన వెంటవచ్చునదేమిటంటూ / కూడబెట్టిన జ్ఞాపకాల్ వెనుదిరిగి చూడక నెమరువేయక/ ఆనంద భరితం నిర్మలం ఈ పుడమి వీడి చనుటకెవ్వడు/ మౌనమై కబలించి వేసే చావునెట్టుల ఇచ్చగించును ‘ అంటూ సాగే ఈ దీర్ఘ కవితలో మనిషి అంతిమ మజిలీని అద్భుతంగా ఆవిష్కరించారు. ఎవరి బాధనైనా తన బాధగా తాదాత్మ్యం చెందుతారు కనుకనే వీరు ఆర్తి కవిగా లోక ప్రసిద్ధులయ్యారు. ఎంవి గోనా రెడ్డి గారి తండ్రి గారు మరణించినప్పుడు వారి అంత్యక్రియలకు వెళ్లి వచ్చిన రాత్రి రాసిన కవిత ’ నాన్నా అమ్మనడిగి చెప్పు ’. అనంత వాయువుల్లో కలిసిపోయిన/ అమ్మ అసువుల సాక్షిగా/ అక్షరాలా ఒట్టేసుకున్నాను/ ఆ చితిమంటలు రగిలి రగిలి/ రేపు నిన్ను అసలే కబళించుకుపోయే/ ఆ తుది గడియ దాకా/ మిన్ను విరిగి మీద పడ్డా/ నాన్నా నీ మనసు నొప్పించవద్దని’ అనే మాటల్లో తల్లిని కోల్పోయిన దుఃఖం, తండ్రిని కాపాడుకోవాలనే తపన సగటు కొడుకు ఆవేదన కనిపిస్తుంది.
అవసాన దశలో తల్లిదండ్రులను మనం ఎంత బాగా చూసుకున్నా వాళ్లను కోల్పోయిన రోజు మాత్రం సరిగ్గా చూసుకోలేకపోయానే అనే ఒక వెలితి మాత్రం ఏ కొడుకు అయినా అనుభవిస్తూనే ఉంటాడు. ఈ సంఘర్షణని ఎంత బాగా చెప్పారో చూడండి
’అమ్మ తోడు ఎడబాసి/ ఎండమావైన నైరాశ్యపు నిశీధిలో
క్షణాలు యుగాలుగా గడిపిన/ మీ జీవిత శేష కాలాగ్నికి
నేను ఆజ్యం పోసానని/ నా అంతరాత్మ ఘోషిస్తున్నది’ ఇలా మనిషి జీవితంలో ఎదురయ్యే విషాద సన్నివేశాలను కవిత్వీకరించడం ద్వారా ఈ కవి ఆర్తి కవి అయ్యాడు.
ప్రముఖ కవి అయిల సైదాచారి మరణం ఈ కవిని తీవ్రంగా కదిలించింది.
పరుగు ఏ దిక్కుకో తెలియని ఒక/ తెరిచిన కండ్లార్పకుంట
విదిల్చిన రెక్కలు వాల్చకుంట/మిణుకు మిణుకుమనే మిణుగురుల/నడిమాపు అగోచర చెమక్కుల/మాయజేసిన మాంత్రికుడా / బతుకు నడిపొద్దుకే బిరబిరమని/గడప దాటితివి కదరా/ మరో ఈ విశ్వ దర్శనానికి/ సమాయత్తం కావడానికి
ఏ మజిలీలోనో కాపు కాస్తున్న/ సుందర సుఖాల భాష్యమెరిగిన విరాగీ/ సైదూ! ఎప్పుడొస్తవురా ఎదురు చూస్తున్న…. అంటూ సైదాచారి మళ్లీ జన్మిస్తాడని ఆశావహ దృక్పథాన్ని ప్రకటించారు. సైదాచారి అకాల మరణాన్ని బతుకు నడి పొద్దుతో పోల్చడం గొప్ప ప్రతీక.
ఒకప్పుడు సూర్యాపేటలో తన సహాధ్యాపకుడైన బషారత్ ఆలీ మరణాన్ని తలుచుకొని పొగిలి పొగిలి దుఃఖించాడు. ఆ దుఃఖంలోనే ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాడు. ’ఒక యోగి భాషించిన మౌనం’ అనే కవితలో… నాలుగు దశాబ్దుల కిందట/ సూర్యాపేట వీధుల్లో డొక్కు సైకిలేసుకొని/జనసముద్రం మధ్యన / ఒంటరివాడై తిరిగాడిన మౌని బషారత్ అలీ/ ఇదిగో! ఇప్పుడిట్లా కండ్లల్ల మెదులుతున్నడు/ సూడోమోడర్న్ హిపోక్రసీకి/ అనార్కిజం ఒక మాస్క్/ అనార్కిస్టంటే అరాచకుడని కాదు/ చీకటిబతుల లోకం ముసుగేసుకునే/రోత విలువల అక్కరలు లేని వాడని/నిరాడంబరంగా తిరిగిన రుషి వంటి రూపం బషారత్ అలీ పాఠకుల మనోఫలకంపై మెదులుతాడు. ఈ కోవలోనిదే నేడు మనం చర్చిస్తున్న సడిలేని గోస. ఈ టైటిల్ నిర్ణయించడంలోనే కవి ప్రతిభ ద్యోకతమవుతున్నది. ’ దుఃఖానికి మీసాలు ఉండవు అంటాడు మునాసు వెంకట్. నిజమే.. దుఃఖ భారాన్ని దింపుకోవడంలో స్త్రీ పురుష తేడాలు ఉండవు. విశేషించి పురుషుల దుఃఖం అంతగా బహిర్గతం కాదు కానీ మనసులో కుమిలి కుమిలి ఏడుస్తారు. అది నిశ్శబ్దమైన దుఃఖం. ఆ పరిస్థితినే ఈ కవి సడినేని గోస అన్నారు. ఇదొక విషాద గీతిక. నా అనుకున్న వాళ్ళను పోగొట్టుకున్నప్పుడు వెలువడే ఆర్ద్ర గీతం. గతంలోనూ ఈ నల్లగొండ నేల నుండి ఇలాంటి విషాద గీతికలు వినిపించాయి. ఎలికట్టె శంకర్రావు యాది , డాక్టర్ బెల్లి యాదయ్య తర్జుమా, అంబటి వెంకన్న నాన్నే నా చిరునామా ఈ కోవలోని దీర్ఘ కవితలే..
ఇక సడి లేని గోస విషయానికి వచ్చినట్లయితే ఆంగ్లో ఉపన్యాసకులు బైరెడ్డి సతీష్ రెడ్డి తల్లి గారు శ్రీమతి బైరెడ్డి తారకమ్మ గారు గత సెప్టెంబర్ మాసంలో పరమపదించినప్పుడు రాసిన ఎలిజీ గీతం ఇది.
మృత్యు శయ్య మీద ముసుగును తొలగించి/ అమ్మ చేతిని కడసారిగా నాయన తన చేతిలోకి తీసుకున్న/ ఆ విద్యుత్తు ప్రసరణలో/ ఎన్నెన్ని చిరు కలహాల తలపోతలో/ ఎన్నెన్ని అలక పాన్పుల పురాస్మృతులో/ ఎన్నెన్ని ప్రణయ కడలుల ఊసులాటలో/ ఆ క్షణాన వెల్లువెత్తిన జ్ఞాపకాల ఉప్పెనలై/
ఎడారి అయిపోయిన ఇసుక తిన్నెల మీద/ చిందర వందరగా పొంగిపొర్లాడినాయో అంటూ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
బైరెడ్డి కృష్ణారెడ్డి ఎలిజిల నిర్మాణంలో ఒక ప్రత్యేకమైన శిల్పం గోచరిస్తున్నది. తాను చెప్పదలచుకున్న విషయాన్ని కవిత్వీకరిస్తూనే ఆ సంఘటన నేపథ్యంలోని సంభాషణలు సైతం యధాతధంగా చేర్చడం గమనించవచ్చు. అయిల సైదాచారి కవితలో ఆయన అర్ధాంగి శివ జ్యోతి తో మాట్లాడుతున్నట్లు, బషారత్ ఆలీ ఎలిజీ లో బా రహమతుల్లాతో మాట్లాడుతున్నట్లు, సడి లేని గోసలోనూ బైరెడ్డి సతీష్ రెడ్డితో, ఆయన తండ్రి యేసి రెడ్డితో సంభాషిస్తున్న వైనం గమనించవచ్చు.
ఒకరి చావును చూస్తున్న సమయంలో తన చావును దర్శించుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి. అమ్మ మృత్యుఘంటికలలో/ ఎవరెవరి చావు సంకేతరణగొణ ధ్వనులో కాదు/ నాకు నా మృత్యుఘంటికలు వినబడుతున్నాయి/ నా గుండె చప్పుడు ఆగిపోయిన నాడు/ నన్ను ఆ చితి మంటల దగదగలకు/ ఆహుతి ఇచ్చి నాకు తిలోదకాలు ఇవ్వడానికి/ ఎవరికీ కనపడనీయకుండా/ రెండు కన్నీటి బొట్లను నీ గుండెల్లో/ పదిలంగా దాచిపెట్టుకుంటావు కదూ… ఇదీ బైరెడ్డి మార్కు కవిత్వం…
ఈ కవిత్వం చదివిన డాక్టర్ సంకిరెడ్డి నారాయణరెడ్డి గారు I am unable to judge at the moment అని వ్యాఖ్యానించారు అంటే ఆ కవిత్వంలోని సాంద్రతను అర్థం చేసుకోవచ్చు. కవిత చివరలో బైరెడ్డి గారు అన్నట్లు కలతపడ్డ అంతరంగము నుండి తెరలు తెరలుగా మాలికలు అల్లుకున్న అక్షర నీరాజనం ఇది. ఈ ఆర్తి కవిని మరొకసారి మనసారా అభినందిస్తూ ముగిస్తున్నాను.

( సడిలేని గోస దీర్ఘ కవిత నల్లగొండ పరిచయ సభ సందర్భంగా ప్రసంగ పాఠం)

డా. సాగర్ల సత్తయ్య 7989117415

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News