ప్రయాగ్‌రాజ్ (యుపి) : వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు దక్షిణ సెల్లార్‌లో పూజ కొనసాగుతుందని అలహాబాద్ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఈ మేరకు జిల్లా కోర్టు జారీ చేసిన ఉత్తర్వును సవాల్ చేస్తున్న అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. మసీదు ‘వ్యాస్ తెహ్‌ఖాన’ లేదా దక్షిణ సెల్లార్‌లో పూజను అనుమతిస్తున్న వారణాసి జిల్లా కోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ మసీదు మేనేజ్‌మెంట్ కమిటీ దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు న్యాయమూర్తి రోహిత్ రంజన్ అగర్వాల్ కొట్టివేశారు. అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన రెండు అప్పీళ్లను హైకోర్టు తోసిపుచ్చింది. జిల్లా మేజిస్ట్రేట్‌ను ‘వ్యాస్ తెహ్‌ఖాన’ రిసీవర్‌గా నియమిస్తూ జిల్లా జడ్జి జనవరి 17న జారీ చేసిన ఉత్తర్వును, మసీదు సెల్లార్‌లో పూజను అనుమతిస్తున్న జనవరి 31 నాటి ఉత్తర్వును కమిటీ సవాల్ చేసింది. ‘వ్యాస్ తెహ్‌ఖాన’లో పూజ కొనసాగుతుందని హైకోర్టు తెలియజేసింది.
జస్టిస్ అగర్వాల్ అప్పీళ్లను కొట్టివేస్తూ, ‘కేసు రికార్డులు అన్నింటినీ పరిశీలించిన తరువాత, కక్షిదారుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న తరువాత ఆస్తి రిసీవర్‌గా వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను నియమిస్తూ జిల్లా జడ్జి జనవరి 17న ఇచ్చిన తీర్పు, తెహ్‌ఖానలో పూజను అనుమతిస్తున్న జనవరి 31 నాటి జిల్లా కోర్టు తీర్పు విషయంలో జోక్యానికి కారణాలు ఏవీ కోర్టుకు కనిపించడం లేదు’ అని తెలిపారు. కక్షిదారుల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం హైకోర్టు న్యాయమూర్తి ఈ నెల 15న తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ జ్ఞాన్‌వాపి మసీదు వ్యవహారాలను నిర్వహిస్తుంటుంది. జిల్లా కోర్టు ఉత్తర్వుపై తన అప్పీల్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించి హైకోర్టును ఆశ్రయించవలసిందని కోరిన కొన్ని గంటల తరువాత ఈ నెల 2న హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేసింది.