సుక్మా : ప్రాణాంతకమైన దాడుల్లో పాల్గొన్నట్టు ఆరోపణలున్న నక్సలైట్ కమాండర్ నగేష్ అలియాస్ పెడకం ఎర్ర (38) ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో సోమవారం పోలీస్‌లు, భద్రతాదళాల ముందు లొంగిపోయాడు. ఆయన తలపై రూ.8 లక్షల రివార్డు ఉంది. నక్సల్స్ అమానవీయ, శుష్క మావోయిస్టు భావజాలానికి విసిగిపోయి తనంతట తానే పోలీస్‌ల ఎదుట లొంగిపోయాడని సుక్మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ జి చావన్ వెల్లడించారు. జిల్లా పోలీస్‌ల పునరావాస ఉద్యమానికి ప్రభావితమైనట్టు ఎర్ర చెప్పాడు. నక్సల్స్ స్థానిక దళం ( ఎల్‌ఒఎస్ )లో 2003లో ఎర్ర చేరాడు.
2015లో నక్సల్స్ కంపెనీ కమాండర్ ఆఫ్ పిఎల్‌జిఎ బెటాలియన్ నెం.1 గా ఎదిగాడు. 2010లో తాడ్‌మెట్ల సామూహిక మారణ కాండతోపాటు అనేక ప్రాణాంతక దాడుల్లో పాల్గొన్నాడు. తాడ్‌మెట్ల మారణకాండలో 76 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 2017 బుర్కపాల్ దాడిలో 25 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు బలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన లొంగుబాటు, పునరావాస పథకం కింద ఎర్రకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. గత ఏడాది ప్రారంభమైన పునరావాస పథకం కింద ఈ జిల్లాలో ఇప్పటివరకు 176 నక్సలైట్లు లొంగిపోయారు.