Saturday, November 23, 2024

టీమిండియాకు సిరీస్

- Advertisement -
- Advertisement -

రాంచి: ఇంగ్లండ్‌తో రాంచి వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మరో టెస్టు మిగిలివుండగానే 31తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ బౌలర్లు అసాధారణ పోరాట పటిమను కనబరిచినా జట్టును మాత్రం గెలిపించలేక పోయారు. ఆరంభంలో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, చివర్లో శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌లు చిరస్మరణీయ బ్యాటింగ్‌తో టీమిండియాకు విజయం సాధించి పెట్టారు.

రోహిత్ హాఫ్ సెంచరీ..
40/0 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాలుగో రోజు బ్యాటింగ్‌ను చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మలు అండగా నిలిచారు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. కెప్టెన్ రోహిత్ సమన్వయంతో బ్యాటింగ్ చేయగా, యశస్వి దూకుడును ప్రదర్శించాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఆరంభంలో సఫలం కాలేదు. అయితే 44 బంతుల్లో ఐదు ఫోర్లతో 37 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్‌ను జో రూట్ ఔట్ చేశాడు. దీంతో 84 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఔటయ్యాడు. 81 బంతుల్లో ఒక సిక్సర్, ఐదు బౌండరీలతో 55 పరుగులు చేసిన రోహిత్‌ను టామ్ హార్ట్‌లీ వెనక్కి పంపాడు.

బషీర్ మ్యాజిక్..
తర్వాత వచ్చిన రజత్ పటిదార్ మరోసారి నిరాశ పరిచాడు. సిరీస్‌లో వరుస అవకాశాలు లభిస్తున్నా అతను మాత్రం దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఆరు బంతులు ఆడిన పటిదార ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. షోయబ్ బషీర్ ఈ వికెట్‌ను తీశాడు. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజాలు జాగ్రత్తగా ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరు సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్ల సహనాన్ని పరీక్షించారు. జడేజా పరుగులు తీయకున్నా వికెట్‌ను కాపాడుకోవడంలో సఫలమయ్యాడు. అయితే 33 బంతుల్లో 4 పరుగులు చేసిన జడేజాను బషీర్ ఔట్ చేశాడు. తర్వాతి బంతికి యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ (0)ను కూడా బషీర్ వెనక్కి పంపాడు. దీంతో భారత్ 120పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఒక దశలో వికెట్ నష్టపోకుండా 84 పరుగులతో పటిష్టంగా ఉన్న భారత్ బషీర్ దెబ్బకు వెంటవెంటనే ఐదు వికెట్లను కోల్పోయింది.

గిల్, జురెల్ పోరాటం..
ఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్ మ్యాచ్‌పై పట్టుబిగించినట్టే కనిపించింది. పిచ్ కూడా బౌలింగ్‌కు సహకరించడంతో భారత్‌కు కష్టాలు తప్పక పోవచ్చని అందరూ భావించారు. కానీ యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, శుభ్‌మన్ గిల్‌లు అసాధారణ పోరాట పటిమతో భారత్‌కు అండగా నిలిచారు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టును లక్షం వైపు నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఇంగ్లీష్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన శుభ్‌మన్ గిల్ 124 బంతుల్లో రెండు సిక్సర్లతో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు అసాధారణ బ్యాటింగ్‌తో అలరించిన ధ్రువ్ జురెల్ 77 బంతుల్లో రెండు బౌండరీలతో అజేయంగా 39 పరుగులు చేశాడు. ఇద్దరు కలిసి ఆరో వికెట్‌కు అభేద్యంగా 72 పరుగులు జోడించి భారత్‌ను గెలిపించారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన జురెల్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్దు దక్కింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News