Sunday, November 24, 2024

డ్రైవర్, స్టేషన్ మాస్టర్‌దే తప్పు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జమ్మూతావిపఠాన్‌కోట్ సెక్షన్‌లో జమ్మూలోని కతువానుంచి పంజాబ్‌లోని ఉచ్చిబస్సి రైల్వే స్టేషన్ దాకా దాదాపు 70 కిలోమీటర్లు గూడ్సు రైలు డ్రైవర్ లేకుండా నడిచిన ఘటనలో డ్రైవర్, స్టేషన్ మాస్టర్‌లు తమ విధి నిర్వహణలో విఫలమయినట్లు ఈ సంఘటనపై జరిపిన ప్రాథమిక దర్యాప్తు పేర్కొంది. ఈ సంఘటనతో సంబంధం ఉన్న వివిధ వ్యక్తుల స్టేట్‌మెంట్లను రికార్డు చేశామని, గూడ్సురైలు డ్రైవర్, కతువా స్టేషన్ మాస్టర్ తమ విధి నిర్వహణలో అలసత్వంతో వ్యవహరించినట్లు జరిగిన సంఘటనను బట్టి తెలుస్తోందని అయిదుగురు సీనియర్ రైల్వే అధికారులు సంతకాలు చేసినీ సంయుక్త నివేదికలో పేర్కొన్నారు హ్యాండ్ బ్రేక్‌లు వేసి ఇంజన్‌ను, గూడ్సురైలుకు చెందిన మూడు వ్యాగన్లను పూర్తిగా నిలిచిపోయేలా చేయడమే కాకుండా ఇంజన్ ముందుకు కదలకుండా ఉండేందుకు చక్రాల ముందు రెండు కర్ర దుంగలను కూడా పెట్టినట్లు లోకో డ్రైవర్ తన స్టేట్‌మెంట్‌లో చెప్పినట్లు పిటిఐ సంపాదించిన ఆ నివేదిక పేర్కొంది.

అయితే రైలును ఉచ్చి బస్సి స్టేషన్‌లో ఆపిన తర్వాత సంబంధిత స్టేషన్ మాస్టర్ నిర్వహించిన ఇన్‌స్పెక్షన్‌లో హ్యాండ్ బ్రేక్‌లు ఉండాల్సిన పొజిషన్‌లో లేవని తేలినట్లు ఆ నివేదిక పేర్కొంది. స్టేషన్ మాస్టర్ జరిపిన తనిఖీని వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది. అంతేకాదు డ్యూటీలో ఉన్న కతువా స్టేషన్ మాస్టర్ ఉదయం 6.05నుంచి 7.10 నిమిషాల మధ్య రైలును స్థిరీకరించలేదని కూడా ఆ నివేదిక పేర్కొంది. రైలు కదలకుండా ఉండేందుకు బ్రేకులు సరిగా వేశారా లేదా, ఇతర చర్యలు తీసుకున్నారా లేదా అనే విషయాన్ని స్టేషన్ మాస్టర్ చెక్ చేయాల్సి ఉంటుంది. అది నిర్మాణం, ఇతర అవసరాలకోసం మెటీరియల్ తీసుకువెళ్లే డివిజినల్ మెటీరియల్ ట్రైన్(డిఎంటి) అని,53 వ్యాగన్లతో దాన్ని కతువా స్టేషన్‌లో ఆపి ఉంచారని, దానికి బ్రేక్ వ్యాన్(గార్డు కోచ్) లేదని కూడా ఆ నివేదిక పేర్కొంది. ఉదయం 6.20 గంటల సమయంలో స్టేషన్ మాస్టర్ గూడ్సును జమ్మూకు తీసుకెళ్లమని డ్రైవర్‌కు చెప్పాడని, అయితే రైలుకు గార్డు కోచ్‌గానీ, గార్డు కానీ లేనందుకు డ్రైవర్ అందుకు నిరాకరించాడని ఆ నివేదిక పేర్కొంది.

కాగా రైలును షట్‌డౌన్ చేయాలని, డ్యూటీనుంచి దిగిపోయి, జమ్మూకు వెళ్లేందుకు వేరే రైలు పట్టుకోవాలని కంట్రోల్ రూమ్ డ్రైవర్‌ను ఆదేశించింది. దీంతో ఉదయం 6 గంటల సమయంలో డ్రైవర్ తాళాలను స్టేషన్ మాస్టర్‌కు అప్పగించి జమ్మూకు వెళ్లిపోయినట్లు నివేదికలో పేర్కొన్నారు. అయితే పల్లం కావడంతో రైలు కదిలిపోయిందని, ఉదయం 6 గంటలనుంచి 7.10 దాకా ఎవరూ లేకుండానే ఉండిందని ఆ నివేదిక పేర్కొంది. నిబంధనల ప్రకారం ట్రైన్‌ను ఎవరూ లేకుండానే వదిలి వెళ్లాలని స్టేషన్ మాస్టర్ గార్డుకు లిఖితపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుందని, అయితే ఈ రైలు విషయంలో అలా చేయలేదని నిపుణులు అంటున్నారు. అలాగే లోకో డ్రైవర్ కూడా లోడ్‌స్ట్టెబిలైజింగ్ రిజిస్టర్‌లో ఎలాంటి ఎంట్రీ చేయడం కానీ, సంతకం చేయడం కానీ చేయలేదని నివేదిక పేర్కొంది. ప్రాథమిక నివేదిక ఆధారంగా ఫిరోజ్‌పూర్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆరుగురు రైల్వే అధికారులను సస్పెండ్ చేసి పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

కాగా ఈ విషయమై ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ శోభన్ చౌదరిని సంప్రదించగా, దర్యాప్తు కొనసాగుతున్నందున రైల్వే అధికారులపై తీసుకోబోయే చర్యలకు సంబంధించి ప్రస్తుతం తాను ఎలాంటి ప్రకటనా చేయలేనని ఆయన చెప్పారు. డ్రైవర్ లేని గూడ్సు రైలు దాదాపు 75 కిలోమీటర్లు గంటకు 70నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని, ఎనిమిదినుంచి తొమ్మిది స్టేషన్లను క్రాస్ చేసినట్లు రైల్వేశాఖ అధికారిక ప్రకటనపేర్కొంది. ఉచ్చిబస్సి రైల్వే స్టేషన్ వద్ద ఇసుక బస్తాలు, కర్రదుంగలు అడ్డుగా పెట్టి దాన్ని ఆపినట్లు ప్రకటన పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News