Friday, December 20, 2024

మేడిగడ్డ బ్యారేజీనా… బొందలగడ్డనా మీరే తేల్చాలి:జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకులపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ బిఆర్‌ఎస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి మాటలపై బిఆర్‌ఎస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని, మరి మేడిగడ్డనా బొందల గడ్డనా, మేడిగడ్డకు ఏం పీకనికి పోతున్నారని ముఖ్యమంత్రిగా పని చేసిన కెసిఆర్ అలాంటి మాటలు మాట్లాడటం సరైందా..? అని ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీనా..బొందల గడ్డనో కెసిఆర్ తేల్చాలని ఆయనన్నారు. మా వాళ్ళు మేడిగడ్డ లోని అవినీతిని పీకడానికి వెళ్లారని ఆయనన్నారు. మనం కూడా పద్దతిగా మాట్లాడాలి అని మీ మేనమామ కి చెప్పు హరీష్, మీరు ఒకటి అంటే మా వాళ్ళు వంద అంటారు అని జగ్గారెడ్డి హరీష్‌రావుకు సలహానిచ్చారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగింది నిజమేనా కదా..? కెటిఆర్, హరీష్ రావు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

మీడియాలో వచ్చిన వార్తలు చూసి రాహుల్ గాంధీ మేడిగడ్డ పోయారని, ప్రజాధనం దుర్వినియోగం జరగొద్దని, బాద్యులపై చర్యలు ఉంటాయని రాహుల్ గాంధీ చెప్పారని ఆయనన్నారు. ప్రజల పన్నుల తో వచ్చిన డబ్బులతోనే ప్రాజెక్టు లు కడతారని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో మేడిగడ్డ లో ఏం జరిగిందో చూపించారన్నారు. ఆర్థికాంశాలు సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ప్రజలకు వివరించారన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులు మేడిగడ్డ వెళ్లి చూసి వచ్చారని తెలిపారు. రేవంత్ మాటలు గురించి మాట్లాడే వీళ్లు కెసిఆర్ మాటలు తప్పు అని ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. మనం కూడా ఇలా మాట్లాడొద్దు అని మీ మేనమామా కు చెప్పు అని ఆయన హరీష్‌రావుకు సూచించారు. కెసిఆర్ ఒకటి అంటే మేము వంద అంటామని ధ్వజమెత్తారు. మేడిగడ్డకు మా సిఎం పిలిచినప్పుడు కెసిఆర్ ఎందుకు రాలేదని అడిగారు. దీనికి సమాధానం చెప్పాలని కోరారు. కెసిఆర్ అసెంబ్లీ లో చర్చకు ఎందుకు రాలేదని అడిగారు. కెసిఆర్ రాకుండా మేడిగడ్డ పోయినా వృధా అని కడియం శ్రీహరి మాటలకు విలువ లేదన్నారు. బాల్క సుమన్ పిల్లోడు..పిల్లాడిగా ఉండాలని హితువు పలికారు.

బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి
బిజెపి నేత బండి సంజయ్ పొన్నం ప్రభాకర్‌కు క్షమాపణ చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. మీ అమ్మని అంటే కోపం రాదా నీకు సంజయ్ అంటూ నిలదీశారు. శ్రీరాముడు దేవుణ్ణి మోడీ, సంజయ్, కిషన్ రెడ్డి లే మొక్కుతున్నట్టు, దునియాలో ఎవరు మొక్కడం లేదన్న బిల్డప్ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. శ్రీరాముడు ఆదర్శ మూర్తి.. రానున్న తరాలకు ఆదర్శమని, ఆదర్శంగా బతకాలని చెప్పాడన్నారు. రాముడి పేరు మీద ఓట్లు అడిగి బిజెపి నేతలు బతుకుతున్నారని దుయ్యబట్టారు. శ్రీరాముడు తల్లి మాటలు విని అడవికి పోయాడు, రాముడు తల్లిని గౌరవించారు, మరి నువ్వు పొన్నం తల్లిని ఎందుకు గౌరవించలేదు సంజయ్ అంటూ నిలదీశారు. రాజకీయంగా పొన్నం, బండి ఎంత కొట్టుకున్న ఎవరు పట్టించుకోరని, కానీ అమ్మ గురించి మాట్లాడటం ఎందుకని అడిగారు. బండి సంజయ్ క్షమాపణ చెప్పే వరకు ఆందోళనలు కొనసాగుతాయని జగ్గారెడ్డి హెచ్చరించారు.

మెదక్ నుండి పోటీకి ఆసక్తి లేదు
మెదక్ ఎంపీగా పోటీ చేయాలని ఆసక్తి లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్లే అభ్యర్థి అని చెప్పారు. టైం బాగా లేక సంగారెడ్డిలో ఓడిపోయానని, . సంగారెడ్డిలో ఓడిపోయిన. మా ప్రజలు రెస్ట్ ఇచ్చారు. ఐదేళ్లు రెస్ట్ ఇచ్చారు. కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. గెలిపిస్తే పని చేస్తా., ఓడకోడితే రెస్ట్ తీసుకుంటా అని చమత్కరించారు. గాంధీ భవన్ లో పార్టీ కోసం పని చేస్తున్నానన్నారు. కడియం శ్రీహరి గాలిపటం జీవితమని, ఎం అర్థం కాక మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. రాజకీయంగా ఆయనకు ఉన్న బాధ ఆయనకు ఉంటుందన్నారు. టిడిపి లో పని చేసినప్పుడు చంద్రబాబు మాటే కదా విన్నది, మా పార్టీ నాయకుడి మాట మేము వింటాం అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News