పాట్నా: బీహార్ లోని కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు ఇద్దరు అధికార ఎన్‌డిఎ పక్షం చేరడంతో వారిని ఫిరాయింపు దారులుగా పరిగణిస్తూ అనర్హత వేటు వేయాలని బీహార్ కాంగ్రెస్ బుధవారం స్పీకర్‌ను అభ్యర్థించింది. బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అఖిలేశ్ ప్రసాద్ సింగ్ నేతృత్వంలో పార్టీ ప్రతినిధి వర్గం స్పీకర్ నంద్‌కిశోర్ యాదవ్‌ను కలుసుకున్నారు. సిద్ధార్ధ్ సౌరవ్, మురారి గౌతమ్ అనే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలపై అనర్హత వేటు వేయాలని కోరారు. మంగళవారం వీరిద్దరూ అసెంబ్లీలో పాలక సంకీర్ణ సభ్యుల వెనుక కూర్చున్నారు.
స్పీకర్‌ను కలిసిన తరువాత అఖిలేశ్ ప్రసాద్ సింగ్ విలేఖరులతో మాట్లాడుతూ.. బీజేపీ తన అధికారాన్ని దుర్వినియోగిస్తూ ప్రలోభాలకు గురి చేస్తోందని, సిబిఐ, ఐడి తదితర దర్యాప్తు సంస్థల ద్వారా బెదిరింపులకు పాల్పడుతోందని, విమర్శించారు. తమ ఎమ్‌ఎల్‌ఎలను వేటాడడాన్ని తాము ఖండిస్తున్నామని ధ్వజమెత్తారు. ఈ వేటకు బలైన వారిలో మురారి గౌతమ్ ఇటీవలనే మంత్రి అయ్యారని పేర్కొన్నారు. ఇప్పుడు ఫిరాయింపులకు పాల్పడిన ఇద్దరు ఎమ్‌ఎల్‌ఎలు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవలసి ఉంటుందన్నారు. నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారని అఖిలేశ్ ప్రసాద్ సింగ్ పేర్కొన్నారు.