Monday, December 23, 2024

జమిలి ఎన్నికలు?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ‘ఒక దేశం ఒకే ఎన్నిక’ అంశంపై రాజ్యాంగంలో కొత్త అధ్యాయం చేర్చాలని, 2029 మధ్య నాటికి దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలు, స్థానిక సంస్థలకు జమిలి ఎన్నికలకు సంబంధించిన బృహత్తర ప్రజాస్వామిక ప్రక్రియ నిర్వహించాలని లా కమిషన్ సిఫార్సు చేసే అవకాశం ఉందని బుధవారం అభిజ్ఞ వర్గాలు సూచించాయి. జమిలి ఎన్నికలపై ‘కొత్త అధ్యాయం లేదా ఒక భాగం’ చేర్చేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని జస్టిస్ (రిటైర్డ్) రితు రాజ్ అవస్థి నేతృత్వంలోని లా కమిషన్ సిఫార్సు చేయగలదని ఆ వర్గాలు సూచించాయి. రానున్న ఐదు సంవత్సరాలలో రాష్ట్ర శాసనసభల గడువులను కలిపివేయాలని, 19వ లోక్‌సభ ఎన్నికలు జరగవలసిన సమయం 2029 మే. జూన్ నెలల నాటికి తొలి జమిలి ఎన్నికల నిర్వహణకు వీలు కుదురుతుందని కూడా కమిషన్ సిఫార్సు చేయవచ్చు. మూడు అంచెల జమిలి ఎన్నికలను ‘ఏకబిగిన’ నిర్వహించడానికి వీలుగా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలు, పంచాయతీలు,

మునిసిపాలిటీల కోసం ‘జమిలి ఎన్నికలు’, ‘జమిలి ఎన్నికల సుస్థిరత’, ‘ఉమ్మడి ఎన్నికల జాబితా’కు సంబంధించిన అంశాలను రాజ్యాంగం కొత్త అధ్యాయంలోచేర్చనున్నట్లు ఆ వర్గాలు తెలియజేశాయి. అసెంబ్లీ గడువులకు సంబంధించిన రాజ్యాంగంలోని ఇతర నిబంధనలను అధిగమించే అధికారం ఆ కొత్త అధ్యాయానికి ఉంటుంది. అసెంబ్లీల గడువులకు సంబంధించిన ఐదు సంవత్సరాల కాలాన్ని మూడు దశలలో కలిపివేస్తారు. మూడు, లేదా ఆరు నెలల మేరకు గడువును కుదించవలసి ఉండే రాష్ట్ర శాసనసభలకు మొదటి దశను వర్తింపజేయవచ్చునని కమిషన్ సిఫార్సు చేయగలదు. ఒక వేళ ఏదైనా ప్రభుత్వం అవిశ్వాసం కారణంగా పతనమైనట్లయితే లేదా హంగ్ సభ ఏర్పడినట్లయితే, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ‘ఐక్య ప్రభుత్వం’ ఏర్పాటును కమిషన్ సిఫార్సు చేయగలదు.

ఐక్య ప్రభుత్వ సూత్రం పని చేయని పక్షంలో సభ తక్కిన గడువుకు కొత్తగా ఎన్నికలను లా కమిషన్ సిఫార్సు చేయవచ్చు. ‘ఒక వేళ కొత్తగా ఎన్నికల నిర్వహణకు నిర్ణయించినప్పుడు, ప్రభుత్వానికి ఇంకా మూడు సంవత్సరాల వ్యవధి ఉన్నప్పుడు ప్రభుత్వం కొనసాగేందుకు వీలుగా తక్కిన గడువు మూడు సంవత్సరాల కోసం ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది’ అని ఒక ప్రతినిధి వివరించారు. రాజ్యాంగాన్ని, ప్రస్తుత చట్టబద్ధ ప్రక్రియను మార్చడం ద్వారా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలు, మునిసిపాలిటీలు, పంచాయతీలకు ఒకేసారి ఏవిధంగా ఎన్నికలు నిర్వహించాలో నివేదిక తయారీకి లా కమిషన్ కాకుండా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నత స్థాయికమిటీ కూడా కృషి చేస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగవచ్చునని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు కనీసం ఐదు రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు జరగవచ్చు. మహారాష్ట్ర, హర్యానా, ఝార్ఖండ్ శాసనసభలకు ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఎన్నికలు జరగవచ్చునని భావిస్తున్నారు.

బీహార్, ఢిల్లీ అసెంబ్లీలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగవలసి ఉన్నది. ఇక అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ అసెంబ్లీలకు 2026లో, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ అసెంబ్లీలకు 2027లో ఎన్నికలు జరగవలసి ఉంది. కాగా, తొమ్మిది రాష్ట్రాలు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్నాటక, మిజోరామ్, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీలకు 2028లో ఎన్నికలు జరగవలసి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News