సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలపై అనర్హత వేటు పడింది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పథానియా వారిని ఎమ్‌ఎల్‌ఎ సభ్యత్వాల నుంచి తొలగించారు. కాంగ్రెస్ తరఫున గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఈ ఎమ్‌ఎల్‌ఎలు తిరుగుబావుటా ఎగురవేయడంతో స్పీకర్ ఈ చర్య తీసుకున్నారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో మొత్తం 15 రాజ్యసభ స్థానాలకు మంగళవారం రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే.
హిమాచల్‌లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడడంతో ఆ పార్టీ అభ్యర్థికి బీజేపీ అభ్యర్థికి సరిసమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో టాస్ వేయగా, బీజేపీ అభ్యర్థిని విజయం వరించింది. ఈ నేపథ్యంలో మంత్రి విక్రమాదిత్యసింగ్ రాజీనామా చేయడం హస్తం పార్టీకి తలపోటుగా మారింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు బీజేపీ ప్రతినిధి వర్గం గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిసినట్టు సమాచారం. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే ఆందోళనకు దిగిన 15 మంది బీజేపీ ఎమ్‌ఎల్‌ఎలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలపై తాజాగా అనర్హత వేటు విధించారు.