Monday, December 23, 2024

ఎన్‌టిఆర్ భవన్‌లో మాజీ స్పీకర్ బాలయోగి వర్థంతి కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : లోక్‌సభ మాజీ స్పీకర్ కీ.శే. జి.ఎం.సి. బాలయోగి వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు బాలయోగి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీరా రాజునాయక్ మాట్లాడుతూ.. జి.ఎం.సి. బాలయోగి ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చారని అన్నారు. లోక్‌సభ స్పీకర్‌గా ఆయన ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించి అందరి మన్ననల్ని పొందారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎస్‌సి, ఎస్‌టి, బిసి మైనార్టీలకు అత్యంత ప్రాధ్యానతనిచ్చిందని అన్నారు. బడుగు బలహీనవర్గాల కొరకు గురుకుల పాఠశాలలను మొట్టమొదటిసారిగా ఎన్‌టిఅర్, తెలుగుదేశం ఏర్పాటు చేసిందని అన్నారు. అదే విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా జస్టిస్ పున్నయ్య చైర్మన్‌గా ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌ను చంద్రబాబు ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఎస్‌సి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడెపు రాఘవులు మాట్లాడుతూ అతి సాధారణ వ్యవసాయ కుటుంబంలో జి.ఎం.సి. బాలయోగి జన్మించి అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారని అన్నారు. దేశంలోనే అత్యున్నత రాజ్యంగ పదవుల్లో ఒకటైన లోక్‌సభ స్పీకర్ స్థానానికి ఒక దళితుడిని ఎంపిక చేసిన ఘనత చంద్రబాబుకు, టిడిపికే దక్కుతుందని అన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలకు కట్టుబడి నీతి, నిజాయితీలకు మారుపేరుగా నిలిచిన గొప్ప ప్రజా నాయకుడు బాలయోగిగారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌టియూసి ఉపాధ్యక్షుడు ఏబిఆర్ మోహన్‌రావు, టిఎన్‌టియూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు, కోశాధికారి జగదీష్, టిడిపి నాయకులు వై. నిర్మల్ కుమార్, దాట్ల శివప్రసాద్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News