పెషావర్ : పాకిస్థాన్‌లో గత 48 గంటలుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు అనేక ప్రమాదాలు సంభవించి దాదాపు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక చోట్ల ఇళ్లు కూలాయి. కొండచరియలు విరిగిపడి దారులు మూసుకుపోయాయి. ముఖ్యంగా వాయువ్య ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో వర్షాలకు బీభత్స పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రావిన్స్‌లో చనిపోయిన 27 మందిలో చాలామంది చిన్నారులే.
బజౌర్, స్వాత్, లోయర్ దిర్, మలకండ్ , ఖైబర్, పెషావర్ , నార్త్, సౌత్ వజిరిస్థాన్,చ లక్కిమార్వట్, తదితర 10 జిల్లాల్లో 37 మంది గాయపడ్డారు. వర్షబాధిత ప్రజలను ఈ క్లిష్టసమయంలో విడిచిపెట్టమని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని, వారు నష్టపోయిన ఆస్తులకు సంబంధించి నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి కెపికె అలి అమీన్ గండపుర్ చెప్పారు. కోస్తా తీర పట్టణం గ్వాడర్‌ను వరదలు ముంచెత్తడంతో వాయువ్య బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో మొత్తం ఐదుగురు చనిపోయారు. అధికార యంత్రాంగం బోట్లు ఉపయోగించి అక్కడి ప్రజలను ఖాళీ చేయించింది.
వరదనీరు ముంచెత్తడంతో అనేక నివాసాలు, వాణిజ్య సముదాయాలు కుప్పకూలాయి. రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఐదుగురు చనిపోయారు. జాతీయ రహదార్లపై కుప్పకూలిన శిధిలాలను తొలగించడానికి సిబ్బందిని పంపినట్టు నేషనల్ డైజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ పేర్కొంది. చైనాతో పాకిస్థాన్‌కు అనుసంధానమైన కారకోరమ్ జాతీయ రహదారిపై కొన్ని చోట్ల కొండచరియలు అడ్డంగా పడి ఉన్నాయి. పాక్ ఉత్తర ప్రాంతంలో అసాధారణమైన హిమపాతం ఉండడంతో టూరిస్టులు ఆ ప్రాంతానికి వెళ్ల రాదని ఉత్తర గిల్‌గిత్ బల్టిస్థాన్ అధికార ప్రతినిధి ఫైజుల్లా ఫరాక్ సూచించారు.