ఈనెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆయన ఆదివారం పర్యటించి గృహజ్యోతి విద్యుత్ వినియోగదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో గృహజ్యోతి పథకం ద్వారా లక్షా 82 వేల మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం మార్చి 1 నుండి అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం కింద జీరో విద్యుత్ బిల్లులు రావడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొటిక్కటిగా 90 రోజుల్లోనే అమలు చేస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయలు, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా నిర్మించి ఇస్తామని తెలిపారు. నల్లగొండ జిల్లాలోని మామిళ్ళ గూడెంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
మూడు నెలల్లో మాన్యం చెల్కలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు కొత్త భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా 1వ తారీఖున జీతాలు ఇస్తున్నామని చెప్పారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఆర్య సమాజ్ ఆవరణలో నల్లగొండ జిల్లా ఆర్య సమాజ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, నల్లగొండ ఆర్‌డిఒ రవి, ట్రాన్స్ కో ఎస్‌ఈ చంద్రమోహన్, డిఒ వెంకటేశ్వర్లు, ఎడి సత్యనారాయణ, ఎఇ రమ్య, ఆయా వార్డుల కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.