మనతెలంగాణ/హైదరాబాద్ : కుంగిపోయిన బ్యారేజిల్లో నీటిని నింపాలని డిమాండ్ చేస్తూ నీటిరాజకీయాలు చే యటం తగదని రాష్ట్ర నీటిపారదుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి బిఆర్‌ఎస్‌పార్టీ నేతలకు సూచించారు.6వ తేదీన కాళేశ్వరం పరిశీలనకు ఢిల్లీనుంచి నిపుణుల కమిటీ రానుందని ,నిపుణుల కమిటీ రాకను స్వాగతిస్తున్నామని , కమిటీకి అన్ని రకాలుగా సహకరిస్తామని తెలిపారు.నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.గతంలో కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ ను నేషనల్ డ్యామ్‌సేఫ్టీ అథారిటీ పరిశీలించి నీటిని ఖాళీ చేయాలని సూచించిందని తెలిపారు.
సుందిళ్ళ, అన్నారం బ్యారేజ్ లను పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ లో ఉన్న సమస్యలు ఇక్కడ కూడా ఉన్నాయని ఈ రెండు బ్యారేజ్‌లలో కూడా నీటిని ఖాళీ చేయాలని సూచించిందని. అథారిటీ సూచన మేరకే రాష్ట్ర ప్రభుత్వం నీటిని ఖాళీ చేస్తుందన్నారు. ఈ విషయంలో బిఆర్‌ఎస్ రాజకీయాలు చేస్తూ నీటిని నింపాలని డిమాండ్ చేయడం అత్యంత బాధ్యత రాహి త్యం అని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం. సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించిందని తెలిపారు. బ్యారేజీలను పరిశీలించి, కుంగుబాటుకు, పగుళ్లకు కారణాలను విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సిఫారసు చేయాలని ఈ కమిటీకి సూచించిందన్నారు.
నాలుగు నెలల్లోపు తమ రిపోర్టును అందజేయాలని కమిటీకి నిర్ణీత గడువును విధించిందన్నారు. బిఆర్‌ఎస్ నాయకులకు ఎలాంటి సాంకేతిక అవగాహన లేకున్నా మాట్లాడడం దురదృష్టకరం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. నాణ్యత, నిర్వహణ, నిర్మాణం, డిజైన్లు, అన్ని విషయాలల్లో గత ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. 94 వేల కోట్ల వ్యయం చేసిన ఈ ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ గుండెకాయ లాంటిదన్న బిఆర్‌ఎస్ నాయకుల మాటలకు విలువ లేదన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు లో గుండెకాయ లాంటి మెడిగడ్డ కుంగిపోతే ఆవేదన వ్యక్తం చేయాల్సిన బిఆర్‌ఎస్ నాయకులు ఒక్క పిల్లర్ కుంగిపోయిందని మాట్లాడ్డం అత్యం త దురదృష్టకరం అన్నారు.బిఆర్‌ఎస్ నాయకులు బాధ్యత రహితంగా రాజకీయ ప్ర యోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను, రైతాంగ ప్రయోజనాలను పణంగా పెట్టడం దురదృష్టకారం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్యామ్ సెఫిటీ అథారిటీ, నిపుణుల కమిటీ సూచనలను మాత్రమే పాటిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.