హైదరాబాద్: రైతును రాజుగా చేసే పాలనకు నాంది పడింది ఎల్బీ స్టేడియంలోనేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నూతనంగా ఎంపికైన 5,192 మందికి ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించనున్నారు. ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వహించిన సభలో సిఎం మాట్లాడుతూ… మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. తెలంగాణ సాధనలో నిరుద్యోగులు, యువత పాత్ర ఎంతో గొప్పదని, విద్యార్థుల త్యాగాలు, బలిదానాలతోనే తెలంగాణ సాకారమైందన్నారు. తెలంగాణ ఏర్పడితే న్యాయం జరుగుతుందని యువత భావించిందని, కానీ కుటుంబ పాలన యువత ఆకాంక్షలను నెరవేర్చలేదని మండిపడ్డారు. కుటుంబ వ్యక్తుల పదవుల కోసం నిరుద్యోగులను విస్మరించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యుల ఉద్యోగం ఊడగొడితేనే ఉద్యోగాలు వస్తాయని యువత భావించారని చెప్పారు. అనుకున్నట్లే కెసిఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు ఊడిన తర్వాతే యువతకు ఉద్యోగాలు వస్తున్నాయని పేర్కొన్నారు. తనకు ఇంగ్లీష్ రాదని కొందరకు అవహేళన చేస్తున్నారు. తాను జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు మీడియం మాత్రమే చదివానని స్పష్టం చేశారు. తాను గుంటూరు, గుడివాడకు వెళ్లి కార్పొరేట్ పాఠశాలల్లో చదవలేదని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి ఎదిగానన్నారు. వేలాది గురుకులాలు నిర్మించామని గత పాలకులు గొప్పగా చెప్పుకున్నారు. ఎక్కడా గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించలేదని ఆరోపించారు.
వసతులు లేని అద్దె భవనాల్లో పేద విద్యార్థులు అవస్థలు పడ్డారన్నారు. రేషనైలేజేషన్ పేరిట కెసిఆర్ 6 వేల పాఠశాలలను మూసివేశారని తెలిపారు. కుల వృత్తులను వారి పిల్లలు కులవృత్తులే చేయాలని కెసిఆర్ భావించారని సిఎం పేర్కొన్నారు. కెసిఆర్ మనవడి పెంపుడు కుక్క చనిపోతే వెటర్నరి డాక్టర్ మీద కెసిఆర్ కేసు పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. పేదలు గొర్రెలు, బర్రెలు, చేపలు మాత్రమే పెంచాలనట్లుగా కెసిఆర్ వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంపుడు కుక్కకు ఇచ్చిన విలువ పేదల ఆరోగ్యానికి కెసిఆర్ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే చిత్తశుద్ధి తమకు ఉందన్నారు. ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాల పంపిణీ ప్రచారం కోసం కాదు.. యువత కళ్లలో ఆనందాన్ని ప్రత్యేక్షంగా చూసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.