Monday, December 23, 2024

రంజీ ఫైనల్లో ముంబై

- Advertisement -
- Advertisement -

ప్రతిష్ఠాత్మకమైన రంజీ ట్రోఫీలో ముంబై టీమ్ ఫైనల్‌కు చేరుకుంది. తమిళనాడుతో జరిగిన సెమీ ఫైనల్లో ముంబై ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ముంబైకి ఫైనల్ బెర్త్ సొంతమైంది. శార్దూల్ ఠాకూర్ ఆల్‌రౌండ్‌షోతో ముంబైని ఫైనల్‌కు చేర్చాడు. తమిళనాడు రెండు ఇన్నింగ్స్‌లలోనూ తక్కువ స్కోరుకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్‌లో తమిళనాడు 146 పరుగులకే కుప్పకూలింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ముంబై 378 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (55) పరుగులు చేశాడు. హార్దిక్ తమోర్ (35) పరుగులు సాధించాడు. మరోవైపు చిరస్మరణీయ బ్యాటింగ్‌ను కనబరిచిన శార్దూల్ ఠాకూర్ 104 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. తనూష్ కొటియాన్ కూడా అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. తమిళనాడు బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న తనూష్ 126 బంతుల్లో 12 ఫోర్లతో 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తుషార్ దేశ్‌పాండే 3 బౌండరీలతో 26 పరుగులు చేశాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో సాయి కిశోర్ ఆరు, కుల్దీప్ సేన్ రెండు వికెట్లను పడగొట్టారు.

తీరు మారలేదు..
తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన తమిళనాడును తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ముంబై బౌలర్లు సఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలిన తమిళనాడు ఈసారైనా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరుస్తుందని అందరూ భావించారు. అయితే ఈసారి కూడా తమిళనాడు బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. ఆరంభం నుంచే తమిళనాడు వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (5), జగదీశన్ (0) మరోసారి విఫలమయ్యారు. ఈ రెండు వికెట్లను కూడా శార్దూల్ ఠాకూర్ పడగొట్టాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా తేలిపోయాడు. అతను 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో తమిళనాడు 10 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది.

ఈ దశలో బాబా ఇంద్రజీత్, ప్రదోశ్ పాల్ కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరు ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. అయితే కీలక సమయంలో ప్రదోశ్ (25) ఔటయ్యాడు. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇంద్రజీత్ 9 ఫోర్లతో 70 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక జట్టును ఆదుకుంటారని భావించిన విజయ్ శంక్ (24), కెప్టెన్ సాయి కిశోర్ (21) విఫలమయ్యారు. మహ్మద్ (0), అజిత్ రామ్ (4), సందీప్ వారియర్ (0) కూడా విఫలం కావడంతో తమిళనాడు ఇన్నింగ్స్ 51.5 ఓవర్లలో 162 పరుగుల వద్దే ముగిసింది. ముంబై బౌలర్లలో షమ్సశ్రీ ములాని నాలుగు, శార్దూల్, మోహిత్ అవస్థి, తనూస్ కొటియాన్ రెండేసి వికెట్లను పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News