Sunday, January 19, 2025

పేదల కోసం పోరాడేది కమ్యూనిస్టులే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పేదల కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని, సిపిఐ తోనే సమస్యల పరిష్కారం సాధ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం జక్కలొద్దిలో గుడిసెలు వేసుకున్న 2750 కుటుంబాలు వివిధ పార్టీల నుండి సిపిఐలో చేరారు. ఈ సందర్భంగా సమావేశం నిర్వహించారు.  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఎన్. బాల మల్లేష్ పార్టీ కండువాలు కప్పి సిపిఐలోకి వారందరినీ సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం జరిగిన సభలో తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ బూర్జువా పార్టీలు అధికారం కోసమే పని చేస్తాయని, ఆ పార్టీలకు ఎన్నికలపుడే ప్రజల సమస్యలు గుర్తుకు వస్తాయని అన్నారు. కానీ ఎర్రజెండా పార్టీలు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటాయని అన్నారు. దేశంలో వందేళ్లుగా అనేక త్యాగాలతో పునీతమై సజీవంగా ఉన్న పార్టీ సిపిఐ అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం, తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి వేలాది మంది త్యాగాలతో ప్రజల కోసమే పనిచేస్తున్న పార్టీ సిపిఐ అన్నారు. నిరుపేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం లక్షలాది మందిని సమీకరించి భూపోరాటాలు నిర్వహించిన చరిత్ర సిపిఐ ది మాత్రమేనని అన్నారు. వరంగల్ లో ఎం.కాళిదాస్, హనుమకొండలో బి ఆర్ భగవాన్ దాస్ లాంటి నాయకులు పేదలను సమీకరించి గుడిసెలు వేయించారని గుర్తు చేశారు.

సిపిఐ నాయకులు నిరంతరం పేదల గురించే ఆలోచిస్తారని, గాలి, నీరు, భూమి,ఆకాశం ఉన్నంత కాలం ఎర్రజెండా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాలమల్లేష్ మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారం ఎర్రజెండాతోనే సాధ్యమని అన్నారు. అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నా ప్రజలందరి గొంతుకగా నిలిచారని, కార్మిక, శ్రామికుల గళాన్ని వినిపిస్తున్నారని అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికలలో ఇండియా కూటమి అభ్యర్థులనే గెలిపించా లని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి, హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శులు షేక్ బాష్ మియా, పనాస ప్రసాద్, జిల్లా నాయకులు దండు లక్ష్మణ్,సిరబోయిన కరుణాకర్ అక్కపెల్లి రమేష్, సంగి ఎలేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News