Friday, December 20, 2024

సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథిగా కమిన్స్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: ఊహించినట్టే సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కెప్టెన్సీ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఐపిఎల్ మినీ వేలం పాటలో రూ.20.5 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ వ్యవహరిస్తాడు. ఇప్పటి వరకు కెప్టెన్సీలో ఉన్న ఐడెన్ మార్‌క్రమ్ (సౌతాఫ్రికా) సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది.

కిందటి సీజన్‌లో మార్‌క్రమ్ సారథ్యంలో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. దీంతో ఈసారి సారథిని మారుస్తారనే ఊహగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు ఆ ఊహాగానాలు నిజమయ్యాయి. కమిన్స్‌ను కళ్లు చెదిరే ధరకు తీసుకున్నప్పుడే అతనికి కెప్టెన్సీ అప్పగిస్తారనే వార్తలు జాతీయ మీడియాలో వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ సోమవారం సన్‌రైజర్స్ యాజమాన్యం కమిన్స్‌ను కెప్టెన్‌గా నియమిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ నెలలో ప్రారంభమయ్యే ఐపిఎల్ సీజన్‌లో హైదరాబాద్‌కు కమిన్స్ సారథిగా వ్యవహరించనున్నాడు.

ఈసారైనా రాత మారేనా?

ఒకప్పుడూ ఐపిఎల్‌లో అత్యంత బలమైన జట్టుగా పేరు తెచ్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ గత మూడు సీజన్‌ల నుంచి అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. 2021 నుంచి హైదరాబాద్ ఒక్కసారి కూడా నాకౌట్ దశకు చేరుకోలేదు. 2021లో అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. 14 మ్యాచుల్లో కేవలం మూడింటిలో మాత్రం విజయం సాధించింది.

Sunrisers Hyderabad captain is Pat Cummins

2022 సీజన్‌లో కూడా సన్‌రైజర్స్ పూర్తిగా నిరాశ పరిచింది. ఈసారి కూడా మెరుగైన ప్రదర్శన చేయడంలో విఫలమైంది. కేవలం ఆరు విజయాలు మాత్రమే సాధించి 8వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక కిందటి సీజన్‌లో అయితే మరింత ఘోర వైఫల్యం చవిచూసింది. ఈసారి కూడా అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశే మిగిల్చింది. కెప్టెన్‌గా ఐడెన్ మార్‌క్రమ్ పూర్తిగా తేలిపోయాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. కోట్లాది రూపాయలు వెచ్చించి సొంతం చేసుకున్న ఇంగ్లండ్ స్టార్ హారీ బ్రూక్ చెత్త బ్యాటింగ్‌తో నిరాశ పరిచాడు.

రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్‌లు మాత్రమే కాస్త మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. మిగతావారు విఫలం కావడంతో సన్‌రైజర్స్‌కు తీవ్ర నిరాశ తప్పలేదు. 14 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ 4 విజయాలు మాత్రమే సాధించి మరోసారి చివరి స్థానంతో సరిపెట్టుకుంది. ఇలాంటి స్థితిలో కెప్టెన్సీలో ఎంతో మెరుగైన రికార్డును కలిగిన కమిన్స్‌ను కోట్లాది రూపాయలు వెచ్చించి సన్‌రైజర్స్ సొంతం చేసుకుంది. ఊహించినట్టే అతనికే సారథ్య బాధ్యతలు అప్పగించింద.ఇ కనీసం కమిన్స్ సారథ్యంలోనైనా హైదరాబాద్ రాత మారాలని కోరుకుందాం. కాగా, 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 23న కోల్‌కతాతో ఆడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News