Monday, November 25, 2024

మే 10 తర్వాత మాల్దీవుల్లో భారత సైనికులు ఉండొద్దు

- Advertisement -
- Advertisement -

 

మాలె: తన భారత వ్యతిరేక వైఖరిని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు మరోసారి బయటపెట్టారు. మే 10వ తేదీ తర్వాత సివిలియన్ దుస్తులలో ఉన్నవారితో సహా భారత సైనిక సిబ్బంది ఎవరూ తమ దేశంలో ఉండడానికి వీల్లేదని ఆయన ప్రకటించినట్లు మంగళవారం మీడియా కథనాలు తెలిపాయి. భారత సైనిక సిబ్బంది ఉసంహరణపై రెండు దేశాల మధ్య మార్చి 10వ తేదీ గడువుపై అంగీకారం కుదిరిన నేపథ్యంలో మాల్దీవులలోని తమ మూడు ఏవియేషన్ ప్లాట్‌ఫారాలలో ఒకదాన్ని అధీనంలోకి తీసుకునేందుకు భారతీయ సివిలియన్ బృందం గత వారం మాల్దీవులను చేరుకుంది. ఈ పరిణామం నేపథ్యంలో అధ్యక్షుడి నుండి ఈ రకమైన ప్రకటన విడుదల కావడం గమనార్హం.

భారత దళాలను దేశం నుంచి వెళ్లగొట్టడంలో విజయం సాధించిన తమ ప్రభుత్వంపై కొందరు తప్పుడు వదంతులు వ్యాప్తి చేస్తూ పరిస్థితిని వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని అధ్యక్షుడు ముయిజ్జు తెలిపారు. అయితే వీరు(భారత సైనికులు) దేశాన్ని వదిలి వెళ్లడం లేదని, తమ యూనిఫారాలను సివిలియన్ దుస్తులలోకి మార్చుకుని ఇక్కడకే తిరిగివస్తున్నారని ఆయన అన్నారు. మే 10 తర్వాత దేశంలో భారత సైనికులు ఎవరూ యూనిఫారాలలో కాని సివిలియన్ దుస్తులలో కాని ఉండడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు.

ఏ రకమైన దుస్తులు ధరించి భారత సైన్యం ఇక్కడ నివసించడానికి వీల్లేదని ఆయన చెప్పారు. ఇది తాను ఆత్మ విశ్వాసంతో ప్రకటిస్తున్నానని ఆయన చెప్పారు. మాల్దీవులలో మూడు భారతీయ ప్లాట్‌ఫారాలను నిర్వహించడానికి 38 మంది సైనిక సిబ్బంది పనిచేస్తున్నారు. గత కొన్ని సవంత్సరాలుగా రెండు హెలికాప్టర్లు, ఒక డార్నియర్ విమానం ద్వారా మాల్దీవులకు చెందిన ప్రజలకు మానవత, వైద్య తరలింపు సేవలను భారత సైనిక సిబ్బంది అందచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News