Saturday, November 23, 2024

జడ్జిగా రాజీనామా.. గంటలోనే బిజెపిలో చేరిక

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా రాజీనామా చేసిన కొద్ది గంటలకే అభిజిత్ గంగోపాధ్యాయ తాను బిజెపిలో చేరుతున్నట్లు మంగళవారం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, తాను చివరి వరకు ఆ పార్టీపై పోరాడతానని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ప్రకటించారు. తాను మార్చి 7న బిజెపిలో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. బెంగాల్‌లో టిఎంసి అవినీతిపై పోరాడుతున్న జాతీయ పార్టీ అయిన బిజెపిలో చేరాలని తాను నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా విద్యారంగానికి సంబంధించి గంగోపాధ్యాయ ఇచ్చిన అనేక తీర్పులు చర్చనీయాంశమయ్యాయి. ఆయన తీర్పులు అధికార టిఎంసికి రాజకీయంగా ఇబ్బందులను తెచ్చిపెట్టాయి.

రానున్న లోకక్‌సభ ఎన్నికలలో పటీ చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. తాను పోటీ చేయాలా వద్దా అన్నది బిజెపి నాయకత్వం నిర్ణయిస్తుందని, పార్టీ నాయకత్వం తీసుకునే ఎటువంటి నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు. టిఎంసి చేసే అన్యాయాలు, అవినీతిపై తాను పోరాడతానని ఆయన చెప్పారు. కొంతకాలంగా టిఎంసి నాయకులు తనను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని గంగోపాధ్యాయ తెలిపారు. న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు నచ్చకపోయినంత మాత్రాన ఆయనపై ఎలా దుర్భాషలాడతారని ప్రశ్నించారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యవహారాలే తాను బిజెపిలో చేరడానికి కారణమని ఆయన అన్నారు. తాను బిజెపిలో చేరి టిఎంసిపై పోరాడతానని ఆయన చెప్పారు.

పశ్చిమ బెంగాల్‌లో టిఎంసికి నూకలు దగ్గరపడ్డాయని ఆయన హెచ్చరించారు. 2009 లోక్‌సభ ఎన్నికల తర్వాత సిపిఎం నాయకత్వంలోని లెప్ట్ ఫ్రంట్ కనుమరుగై పోయిందని, ఆ తర్వాత 2011 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు చిత్తుగా ఓడిపోడిపోయాయని ఆయన చెప్పారు. టిఎంసికి కూడా అదే గతి పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. బిజెపిలో చేరాలని కొద్ది రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పారు. గత కొద్ది రోజులుగా తాను సెలవులో ఉన్నానని, బిజెపితో సంప్రదింపులు జరుపుతున్నానని ఆయన తెలిపారు. టిఎంసి పోరాడేందుకు ఇదే సరైన వేదికని భావించానని ఆయన చెప్పారు. బిజెపి నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలను గురించి విలేకరులు ప్రశ్నించగా ఆయనను ఇరికించేందుకే టిఎంసి నాయకులు ఆ కేసును సువేందు అధికారిపై బనాయించారని గంగోపాధ్యాయ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News