ప్రభుత్వానికి తెలంగాణ గిరిజన సంఘం వినతి
మన తెలంగాణ / హైదరాబాద్ : ఏజెన్సీ ప్రాంతంలో అన్ని సంస్థల్లో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలివ్వాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మనాయక్ మంగళవారం హైదరాబాద్ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ఏజెన్సీలో గిరిజన అభ్యర్థుల చే ప్రత్యేక డిఎస్‌సి ఏర్పాటు చేయాలని, ఐదవ షెడ్యూల్లో గిరిజన హక్కులను కాపాడాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలో 9 జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతం ఉందని, ఈ ప్రాంతంలో రాజ్యంగం కల్పించిన ఐదవ షెడ్యూల్ ప్రకారం స్థానిక గిరిజనులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉందని తెలిపారు.
గిరిజనులకు నష్టం చేసిన గత ప్రభుత్వాన్ని గద్దె దింపి వన్ సైడ్ గా ఓటు వేసి నియంతృత్వ పాలనకు అంతం పలికారని, కాని ఏజెన్సీ ప్రాంత సమస్యలను ఇప్పటి ప్రభుత్వం గుర్తిస్తుందని భావించినా ఆ వైపు అడుగులు వేయడం లేదనిపిస్తోందని అన్నారు. ఇప్పుడు ప్రకటించిన డిఎస్‌సిలో ఏజెన్సీ అభ్యర్థుల ప్రస్తావన లేకపోవడం గిరిజనులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక కష్టనష్టాలను ఓర్చి చదువులు చదివిన ఉద్యోగాలు రాకపోతే తమ బతుకులు అగమ్య గోచరంగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి 9 జిల్లాల్లో వేల సంఖ్యలో బిఈడి, టిటిసి చేసి ఉన్న విద్యార్థులు అధికంగా ఉన్నారని, ఐదో షెడ్యూల్ ప్రకారం స్థానిక ఏజెన్సీ గిరిజనులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రత్యేక డిఎస్‌సి నియమించాలని కోరారు. అనేక డిపార్ట్‌మెంట్‌లలో స్థానిక గిరిజనులతో 100 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఉందని, అధికారుల నిర్లక్ష్యం, పాలకుల నిర్లక్ష్యం గిరిజనులకు నష్టం చేసేవిగా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏజెన్సీ హక్కులను కాపాడి వారి హక్కులను రక్షించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక వనరులకు అవకాశం ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లేనిచో రాబోయే కాలంలో గిరిజనులతో మమేకమై తమ సమస్యల సాధన కోసం పోరాటం ఒక్కటే మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో డి. రాము నాయక్ ,అనిత, గౌతమి జైపాల్, సమత, దశరథం, రవి తదితరులు పాల్గొన్నారు.