Saturday, December 21, 2024

యుద్ధాలను ఆపి మానవాళిని కాపాడండి

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించి రెండు సంవత్సరాలు గడిచి మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. యుద్ధంలో అమెరికాను మొత్తంగా నిలవరించగల సామర్ధ్యం ఉన్న రష్యా ఉక్రెయిన్ లాంటి దేశాన్ని జయించడంలో ఇంతకాలం పట్టడంపై ప్రపంచ దేశాలు విస్తుపోతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ ప్రకటన చేసినప్పుడు ఉక్రెయిన్ కథ రెండు, మూడు రోజుల్లో ముగిసిపోతుంది, మహా అయితే వారం రోజులు పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఉక్రెయిన్ సైనికుల దేశభక్తి, శక్తిసామర్ధ్యాలు, ప్రజల మద్దత్తు, జెలెన్‌స్కీ నాయకత్వ పటిమ ఇంత కాలం రష్యా లాంటి అతిపెద్ద దేశాన్ని నిలవరించడమే కాక రష్యా వెన్నులో వణుకు పుట్టించింది. నిజానికి జెలెనెస్కీ కోరిన మొత్తం ఆయుధాలు సకాలంలో నాటో కూటమి అందించగలిగితే రష్యాను పూర్తిగా యుద్ధం లో నిర్వీర్యం చేసి రష్యాకు చుక్కలు చూపించేది.

కానీ ఉక్రెయిన్ ను నాటో కూటమిలో చేర్చుకుంటామని మాట ఇచ్చి ప్రలోభానికి అమెరికా గురిచేసింది. దానికి రష్యా ఆగ్రహించింది. ఉక్రెయిన్ తన దేశంలో అంతర్భాగం అంది. దానికి ఉక్రెయిన్ నేత తిరస్కరించాడు. దానితో రష్యా యుద్ధానికి దిగింది. అమెరికా ఉకెయిన్‌ను యుద్ధానికి ఎగదోసింది, అండగా ఉంటామని మాటఇచ్చింది. కానీ తీరా ఉక్రెయిన్ రష్యాతో యుద్ధానికి దిగాక ఉక్రెయిన్ బలం సరిపోలేదు. గత రెండేళ్ళుగా యుద్ధం కొనసాగింది. సకాలంలో అధునాతన ఆయుధాలు సరఫరా చేయడంలో అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలు వెనుకంజ వేశాయి. అప్పటికే ఉక్రెయిన్ సైనికులు 31 వేల మంది యుద్ధ రంగంలో నేలకొరిగారు. అయినా, ఉక్రెయిన్ ధైర్యం కోల్పోలేదు. ఉక్రెయిన్ యుద్ధ సహాయం కోసం అమెరికా ఎంతో ప్రయిత్నించింది.

కానీ, ఇంకా 60 బిలియన్ డాలర్ల ఆయుధ సహాయం అమెరికా చట్టసభలో ఆమోదం పొందకుండా నిలిచిపోవడంతో ఉక్రెయిన్ సైన్యం డీలాపడింది. ఈ యుద్ధానికి నాటో కూటమి సహకారం ఆపనంత వరకు యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది అని రష్యా ప్రకటించింది. అవసరమైతే అణుబాంబులు కురిపించడానికి సిద్ధమని, దానితో ప్రపంచ సంస్కృతీ, నాగరికత తుడిచిపెట్టుకుపోతుందని ఘాటుగానే పుతిన్ హెచ్చరిక చేశాడు. ఈ ప్రకటనతో నాటో కూటమి దేశాలు కలవరపడ్డాయి. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ భయంతో కంపించిపోతున్నాయి. అయితే నాటో కూటమిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఉక్రెయిన్‌కు సైనిక సహకారం, ఆయుధ సహాయం పెంచుతాం అన్న ప్రకటన ఉక్రెయిన్‌కు ధైర్యాన్ని ఇచ్చింది. నాటో కూటమి కూడా పుతిన్ హెచ్చరికలను తీవ్రంగానే పరిగణిస్తున్నాయి.

కానీ ఈ సహాయం ఆలస్యం అవుతూ ఉండటంతో ఉక్రెయిన్ సైనిక సామర్ధ్యం తగ్గిపోతూ ఉంది. రష్యా సైన్యం ముందుకు దూసుకు వస్తున్నాయి. అనేక కీలక ప్రాంతాలన్నింటినీ రష్యా తన ఆధీనంలోకి తెచ్చుకోవడంతో ఉక్రెయిన్ ప్రజలు భయంతో బిక్కచచ్చి బతుకుతున్నారు.ఈ క్రమం లో పుతిన్ చేసిన హెచ్చరికలు ప్రపంచ దేశాలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నా యి. దీనికి ప్రధాన కారణం ఇటీవల భారీ కంటైనర్లతో ఉత్తర కొరియా నుంచి అత్యాధునిక ఆయుధాలు రష్యాకు చేరుతున్నాయని దక్షిణ కొరియా ఇప్పటికే ప్రకటించింది. ఇటీవల పుతిన్ రష్యా సైనిక ప్రముఖుల సమక్షంలో తొలి వార్షిక ప్రసంగం రెండు గంటలకుపైగా కొనసాగింది.

తన ప్రసంగంలో నాటో కూటమి ప్రకటనలో అంశాలను లోతుగా చర్చించారు. పైగా ఈ నెలలోనే మూడు రోజులు పాటు జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు బ్యాంకును పరిరక్షించుకునేందుకు సైతం నిప్పులుకురిసే ఈ ప్రసంగాన్ని పుతిన్ చేసి ఉండవచ్చు. ఇప్పటికే రాజ్యాంగ సవరణలు ద్వారా సుదీర్ఘ కాలం ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే 2036 వరకు అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంది. జోసెఫ్ స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం పరిపాలించిన నేతల్లో పుతిన్ చేరాడు.ఇప్పటికే ఒకవైపు ఉక్రెయిన్ -రష్యా యుద్ధం, మరో వైపు ఇజ్రాయెల్ -గాజా (పాలస్తీనా) యుద్ధాలు ప్రపంచానికి తీరని నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.గాజాలో అమాయక ప్రజలు ఆకలికి, దాహానికి, మందులకి, కనీస అవసరాలకు అలమటించిపోతున్నారు.

యుఎన్‌ఒ అందించే ఆహారం కోసం గుమికూడిన ప్రజలపై ఇజ్రాయెల్ బాంబు దాడులను చేసింది. పిల్లలూ, మహిళలు, వృద్ధులు అనేక మంది చనిపోయారు. ఇంత మందిని చంపినా ఇజ్రాయెల్, రష్యాకు రక్తదాహం తీరడం లేదు. ఐక్యరాజ్యసమితి, భద్రతా సమితి చేష్టలుడిగి చూస్తున్నాయి. ప్రపంచ దేశాలు సైతం మానవత్వాన్ని మరచి కేవలం శాంతి ప్రవచన, ప్రకటనలకే పరిమితం అవుతున్నారు.ఈ రోజుల్లో యుద్ధాలు కేవలం రెండు దేశాలకే పరిమితం కావు. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. మొత్తం మానవాళిపై ఆ ప్రభావం పడుతుంది. అణుఆయుధాల కాలంలో గెలుపోటములు ఇరు ప్రాంతాలకే పరిమితం కావు. మొత్తం మానవాళిపై ఆ ప్రభావం పడుతుంది. ఇంతకాలం మానవుడు ప్రకృతితో పోరాడి సాధించిన ప్రగతి, నాగరికతా, సంస్కృతులు మొత్తం అణుబాంబులతో లిప్తకాలంలో తుడిచిపెట్టుకుపోతుంది. ఐక్యరాజ్య సమితిని బలోపేతం చేయడంలోనే మానవ రక్షణ, ప్రగతి, పర్యవరణ పరిరక్షణ దాగి ఉంది. అందుకు అన్ని దేశాలు స్వార్ధంవీడి ఉమ్మడిగా కృషి చేయాలి.

డా. కోలాహలం
రామ్ కిశోర్
9849328496

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News