Friday, November 1, 2024

మేడిగడ్డకు నిపుణుల కమిటీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంలో దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల బ్యారేజిలను పరిశీలించేందుకు నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ బుధవారం రాష్ట్రానికి రానుంది . కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ జె.చంద్ర శేఖర్ అయ్యర్ నేతృత్వంలో మెుత్తం ఆరుగురు సభ్యుల బృందం హైదరాబాద్‌కు చేరుకోనుంది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందళ్ల బ్యారేజీలను మొత్తం నాలుగు రోజుల పాటు అన్ని కోణాలనుంచి సమగ్రంగా పరిశీలన చేయనుంది. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో రెండు దఫాలుగా సమీక్షలు నిర్వహించనుంది. సమ గ్ర అధ్యయనం అనంతరం నిపుణుల బృందం తిరిగి ఈనెల 9న దిల్లీకి బయ లు దేరి వెళ్లనుంది.

కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంలో భాగంగా గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ అన్నారం , సుందిళ్ల బ్యారేజిలు దెబ్బతినడానికి గల కారణాలను సాంకేతికంగా అధ్యయనం చేయనుంది. ఈ పథకంలో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటు దారితీసిన పరిస్థితులు, డిజైన్లలో లోపాలు,నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలు తదితర అంశాలను వెలికితీయనుంది. బ్యారేజిని తిరిగి పునరుద్దరించేందుకు ఎటువంటి చర్యలు తీ సుకోవాలో , కుంగిన పిల్లర్లకు ఏవిధమైన మరమ్మత్తులు అవసరమో నిపుణుల బృందం సిఫార్సు చేయనుంది. నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ నిపుణుల కమిటిలో కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృతంలో మొత్తం ఆరుగురు సభ్యుల బృందం న్యూఢిల్లీ నుంచి బుధవారం ఉదయం పదిగంటల 20 నిమిషాలకు బయలు దేరి మధ్యాహ్ననికి హైదరాబాద్ చేరుకుం టుంది. జలసౌధలో సాగునీటి శాఖ కార్యదర్శితో నిపుణుల కమిటీ బృందం ప్రాథమిక సమావేశంలో పాల్గొననుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు , పిల్లర్లు పగుళ్లు బారటం, అన్నారం సుందిళ్ల బ్యారేజిల్లో నీటి బుంగలు ఏర్పడటం తదతర అంశాలకు సబంధించిన ప్రాథమిక సమాచారంతోపాటు బ్యారేజిల డిజైన్ల రికార్డులను పరశీలించనుంది. బ్యారేజి నిర్మాణంలో ఉపయోగించిన స్టీల్ , సీమెంట్ నాణ్యత , నిర్మాణ పనుల్లో తనిఖీలు వాటికి సంబంధించిన నివేదికలను పరిశీలించనుంది. తమకు అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని ఈ సమవేశం ద్వారా సమకూర్చుకొనుంది. ఈ సమావేశం ముగిశాక గురు, శుక్రవారాల్లో కుంగిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం సుందిళ్ల బ్యారేజీలను బృందం పరిశీలించనుంది.
దెబ్బతిన్న బ్యారేజీలపైనే ఫోకస్
కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల పథకంలో దెబ్బతిన్న మూడు ప్రధాన బ్యారేజీజిలపైనే నిపుణుల బృందం ప్రధానంగా దృష్టిపెట్టనుంది. ఈ నెల 9న హైదరాబాద్‌లో మరోసారి నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం కానుంది. క్షేత్ర స్థాయిలో తాము చేసిన అధ్యయనాలు, సాంకేతిక పరమైన అంశాల్లో తమ దృష్టికి వచ్చిన అంశాలు, సేకరించిన ఆధారాలు తదితర వాటిని ఈ సమావేశంలో క్రాస్‌చెక్ చేసుకోనుంది. అన్ని వైపులనుంచి పరిశీలన చేసిన అనంతరం ఈ సమవేశంలోనే దెబ్బతిన్న బ్యారేజిలకు సంబంధించి నిపుణుల కమిటి ఒక అభిప్రాయానికి రానుంది.మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కారణాలు, అన్నారం ,సుందిళ్ల బ్యారేజిల్ల ఏర్పడిన నీటి బుంగలు, వాటిని ఏవిధంగా సరిదిద్దాలో అవసరమైన సూచనలో ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. సమావేశ ముగిశాక అదేరోజు రాత్రి హైదరాబాద్ నుంచి డిల్లీకి బయలు దేరి వెళ్లనుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టి అథారిటి నియమించిన కమిటీలోని నిపుణుల బృందం పర్యటనకు రాష్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.
నిపుణుల కమిటీ సూచనల మేరకే చర్యలు!
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి రాష్ట్రం ఏ పనులు చేపట్టాలన్నా నిపుణుల కమిటీ ఇచ్చే సూచనల మేరకే ప్రభు త్వం అడుగులు వేయనుంది. నిపుణుల కమిటి సమగ్ర పరిశీలనల అనంతరం నివేదిక అందజేసేందుకు కమిటీకి డ్యామ్ సేఫ్టీ అథారిటీ నాలుగు నెలలు గడువు ఇచ్చింది. అయితే బ్యారేజిల పునరుద్దరణ ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరగానే నివేదిక ఇవ్వాల్సిందిగా కోరతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. నెల రోజుల్లోనే కమిటి నివేదిక అందజేయాలని కోరతామని తెలిపారు. వర్షాకాలంలో గోదావరి నదికి పెద్ద ఎత్తున వరదలు వచ్చే అవకాశాలను పరిగణనలోకి తీసుకుని వర్షాకాలం ప్రారంభమయ్యే లోపుగానే బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను నిపుణుల కమిటీ నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందచేసేఅవకాశాలున్నాయి.
నిపుణుల సూచనలపైనే మేడిగడ్డ భవితవ్యం
మేడిగడ్డబ్యారేజితో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజిలకు జరిగిన నష్టాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి, అధ్యయనం చేయడంతో పాటు పగుళ్లకు కారణాలు విశ్లేషించి, తగిన సిఫార్సులు చేసేందుకే జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చే నివేదికపైన మూడు బ్యారేజిల భవితవ్యం ఆధారపడి ఉంది. దెబ్బతిన్న బ్యారేజిలకు సంబంధించి కారణాలను వెలికితీయటంలోనూ, వాటిని తిరిగి పునరుద్దరించడంలోనూ తగిన సూచనలు చేసేందుకు మంచి అనుభవం ,తగినంత నైపుణ్యం ఉన్నవారినే కమిటీలో నియమించారు. గతంలో గోదావరి యాజమాన్య బోర్డు చైర్మన్‌గా పనిచేసి తెలంగాణ ప్రాంతంలోని గోదావరి నదీపరివాహంగా అవగాహణతోపాటు, కేంద్ర జల సంఘంకూడా పనిచేసిన అనుభవం ఉన్న నీటిపారుదల రంగం నిపుణులు చంద్రశేఖర్ అయ్యర్ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. కమిటిలో మరో ఐదుగురిని సభ్యులుగా నియమించారు. సెంట్రల్ సాయిల్ అండ్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త యూసీ విద్యార్థి, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త ఆర్ పాటిల్, కేంద్ర జల సంఘం డైరెక్టర్లు శివ కుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ ఉన్నారు. ఎన్‌డీఎస్‌ఏ టెక్నికల్ డైరెక్టర్ అమితాబ్ మీనా కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News