Tuesday, November 26, 2024

రికార్డుల రారాజు అశ్విన్

- Advertisement -
- Advertisement -

అరుదైన ఘనతకు చేరువలో స్టార్ స్పిన్నర్

మన తెలంగాణ/క్రీడా విభాగం: భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. ధర్మశాల వేదికగా గురువారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే ఐదో, చివరి టెస్టు అశ్విన్ కెరీర్‌లో అరుదైన రికార్డుగా నిలువనుంది. ఈ మ్యాచ్ ద్వారా అశ్విన్ వందో టెస్టు మ్యాచ్‌ను అందుకోనున్నాడు. దీంతో అందరి దృష్టి అశ్విన్‌పైనే నిలిచింది. అనిల్ కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లను పడగొట్టిన భారత స్పిన్నర్‌గా అశ్విన్ నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో అశ్విన్ ఐదు వందల టెస్టు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు 99 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన అశ్విన్ ఎన్నో చిరస్మరణీయ రికార్డులను అందుకున్నాడు. తాజాగా ధర్మశాల టెస్టులో మరోఅరుదైన మైలురాయిని అందుకునేందుకు సిద్ధమయ్యాడు.

ఈ మ్యాచ్ ద్వారా వంద టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత దిగ్గజాల సరసన నిలువనున్నాడు. అశ్విన్ కంటే ముందు 13 మంది భారత ఆటగాళ్లు వంద టెస్టు మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నారు. అశ్విన్ 2011లో టెస్టు క్రికెట్‌కు శ్రీకారం చుట్టాడు. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అశ్విన్ భారత్‌కు ఎన్నో మరుపురాని విజయాలు సాధించి పెట్టాడు. అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్‌ల తర్వాత భారత బౌలింగ్ భారాన్ని అశ్విన్ దిగ్విజయంగా మోస్తున్నాడు. రవీంద్ర జడేజాతో కలిసి టెస్టుల్లో భారత్‌కు చిరస్మరణీయ విజయాలు అందిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ ఇప్పటికే 17 వికెట్లను పడగొట్టాడు. రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. 13 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో అశ్విన్ భారత్‌కు ఎన్నో చారిత్రక విజయాలు అందించాడు.

బంతితో పాటు బ్యాట్‌తోనూ అశ్విన్ సత్తా చాటుతున్నాడు. బౌలర్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా అశ్విన్ టీమిండియాపై తనదైన ముద్ర వేశాడు. టెస్టుల్లో ఇప్పటికే మూడు వేలకు పైగా పరుగులు సాధించాడు. అంతేగాక నాలుగు సెంచరీలను కూడా నమోదు చేశాడు. టెస్టుల్లో భారత్‌కు లభించిన అత్యుత్తమ స్పిన్నర్లలో అశ్విన్‌ది ప్రత్యేక పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. సొంత గడ్డపై అయితే అశ్విన్‌కు కళ్లు చెదిరే రికార్డు ఉంది. కెరీర్‌లో రికార్డు స్థాయిలో ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లను పడగొట్టిన బౌలర్‌గా అశ్విన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సార్లు ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లను పడగొట్టిన స్పిన్నర్‌గా అశ్విన్ రికార్డు సృష్టించాడు. అంతేగాక అత్యంత వేగంగా ఐదు వందల వికెట్ల మైలురాయిని అందుకున్న స్పిన్నర్‌గా కూడా అశ్విన్ నిలిచాడు. ఇక ధర్మశాల టెస్టు మ్యాచ్‌లో కూడా రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌కు విజయం సాధించి పెట్టి దీన్ని చిరకాల గుర్తుండి పోయేలా చేసుకోవాలని భావిస్తున్నాడు. కాగా, ఇదే మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ జానీ బెయిర్‌స్టో కూడా వంద టెస్టు మ్యాచ్‌ల మైలురాయిని అందుకోనున్నాడు. ఇంగ్లండ్ అత్యుత్తమ బ్యాటర్లలో బెయిర్‌స్టో ఒకడిగా పేరుతెచ్చుకున్నాడు. ఇటు అశ్విన్, అటు బెయిర్‌స్టోకు ధర్మశాల మ్యాచ్ అరుదైనదిగా చెప్పాలి. ఇందులో ఎవరూ పైచేయి సాధిస్తారో వేచి
చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News