370 ఆర్టికల్ రద్దు తరువాత తొలి పర్యటన
శ్రీనగర్‌లో ర్యాలీలో ప్రసంగించనున్న మోడీ
పలు అభివృద్ధి ప్రాజెక్టుకు శ్రీకారం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ గురువారం శ్రీనగర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించి, బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. పూర్వపు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు సమకూర్చిన రాజ్యాంగం 370 ఆర్టికల్‌లోని నిబంధనలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తరువాత ప్రధాని మోడీ తొలిసారిగా కాశ్మీర్‌ను సందర్శించనున్నారు. అధికార ప్రకటన ప్రకారం, మోడీ శ్రీనగర్ బక్షీ స్టేడియంలో ‘వికసిత్ భారత్, వికసిత్ జమ్మూ కాశ్మీర్’ కార్యక్రమానికి హాజరు కానున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు సుమారు రూ. 5000 కోట్లు విలువ చేసే పథకాలను మోడీ ప్రారంభిస్తారు.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతోను, జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించాలని ప్రతిపక్షాలు కోరుతుండడంతోను ప్రధాని జరపనున్న పర్యటన రాజకీయ ప్రాముఖ్యం సంతరించుకుంటున్నది. ఈ అంశంపై మోడీ ఏమి చెబుతారోనని జనం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని రద్దు చేసి, పూర్వపు రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం విదితమే.
‘స్వదేశ్ దర్శన్’, ‘ప్రషాద్’ (పిల్‌గ్రిమేజ్ రిజువెనేషన్ అండ్ స్పిరిట్యువల్ , హెరిటేజ్ ఆగ్‌మెంటేషన్ డ్రైవ్) పథకాల కింద రూ. 1400 కోట్లకు పైగా విలువ చేసే పర్యాటక రంగానికి సంబంధించిన దేశవ్యాప్త ప్రాజెక్టులను మోడీ ప్రారంభిస్తారని అధికార ప్రకటన తెలిపింది. శ్రీనగర్‌లోని హజ్రత్‌బల్ మందిరం సమీకృత అభివృద్ధి ప్రాజెక్ట్ కూడా వాటిలో ఉన్నది. జమ్మూ కాశ్మీర్‌లో కొత్తగా ఎంపిక చేసిన సుమారు వెయ్యి మంది ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ నియామక పత్రాలు అందజేస్తారని, మహిళా విజేతలు, రైతులు, పారిశ్రామికవేత్తలతో సహా వివిధ కేంద్ర పథకాల లబ్ధిదారులతో ఆయన ఇష్టాగోష్ఠి సాగిస్తారని ఆ ప్రకటన వివరించింది.