Sunday, November 17, 2024

పాలమూరు పాలిట శాపాలు కాంగ్రెస్, చంద్రబాబే: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. మహబూబ్ నగర్ వెనుకబాటు తనానికి కారణం నాటి టిడిపి, కాంగ్రెస్ పాలన అని ధ్వజమెత్తారు. రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును తిట్టాలని, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలని సూచించారు. చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలుగా మారాయని తెలియజేశారు. .
పాలమూరు వలసలకు కారణం ఆ రెండు పార్టీలేనిని, గత పార్టీలు ప్రాజెక్టుల పేర్లు మార్చారు తప్ప పనులు పూర్తి చేయలేదని, తాము పెండింగ్ ప్రాజెక్టును రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని, అలాంటి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తిట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాలమూరు వేధికగా సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సంగారెడ్డిలో రీకౌంటర్ ఇచ్చారు.

పేగులు మెడలో వేసుకొని రాక్షసులు తిరుగుతారని, ముఖ్యమంత్రి మాట్లాడే భాష అదేనా, పడిగట్టు పదాలు, పరుష పదజాలంతో పరిపాలన సాగదని, ప్రతిపక్షంలో ఉన్నట్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు. మంచిపేరు తెచ్చుకోవాలంటే వల్గారిటీ కాదు అని, చిల్లర మల్లర భాష మాట్లాడి పదవి గౌరవం తగ్గించుకోవద్దని రేవంత్ కు చురకలంటించారు. తన ఎత్తు గురించి ఆయన మాట్లాడుతున్నారని, తాను అలా మాట్లాడి విలువ తగ్గించుకోనని, కుసంస్కారంగా మాట్లాడటం వల్ల విలువ దిగజారుతుందని, భవిష్యత్ లో రాజకీయాలకు వచ్చే వారికి స్ఫూర్తిగా మనం ఉండాలని, ఎంత ఎత్తు ఉన్నమన్నది కాదు అని, ప్రజల కోసం ఎంత గట్టిగా పని చేశామన్నది ముఖ్యమని, కెసిఆర్ కిట్లు తెస్తే, రేవంత్ రెడ్డి తిట్లతో పోటీ పడుతున్నడని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయలబ్ధి పొందాలని రేవంత్ చూస్తున్నారని, బిఆర్ఎస్ పాలనలో పాలమూరు ప్రజల బతుకులు బాగుపడ్డాయని, కెసిఆర్ పాలనలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడ్డాయని,
పదేళ్లు పాలమూరును చంద్రబాబు దత్తత తీసుకొని ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు.  పాలమూరు వలసలు వాపస్ చేసింది కెసిఆర్ కాదా? అని ప్రశ్నించారు. వలసలకు నిలయం నాటి పాలకులు చేస్తే, వ్యవసాయానికి నిలయం చేసింది కెసిఆర్ అని కొనియాడారు. తన తండ్రి చనిపోతే స్నానం చేసేందుకు నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు చల్లుకొని వెళ్లినా అని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారని, ఆ సమయంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాదా? అని హరీష్ రావు నిలదీశారు. పాలమూరు ప్రాజెక్టులను కాగితాలకు పరిమితం చేసింది కాంగ్రెస్ కాదా?, పాలమూరు కరువుతో రాజకీయాలు చేసింది కాంగ్రెస్, టిడిపి కాదా?, కెసిఆర్ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారని, పోతిరెడ్డి పాడుకు పొక్క కొట్టి వైయస్ నీళ్లు తీసుకువెళ్తే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని విమర్శించారు.

కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను నాడు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయలేదని, 1984లో కల్వకుర్తికి కొబ్బరికాయ కొట్టి 2014 వరకు 13వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని, కానీ మేము పదేండ్లలోనే 2600 కోట్లు ఖర్చు చేసి 3 లక్షల 7వేల ఎకరాలకు నీళ్లు అందించామన్నారు. నెట్టంపాడు 2300 ఎకరాలకు నీళ్లు ఇస్తే మేము 540 కోట్లు ఖర్చు పెట్టి లక్షా 40వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని, బీమా కింద 12వేల ఎకరాలకు మీరు నీళ్లు ఇస్తే 646 కోట్లు ఖర్చు చేసి లక్షా 60వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని,  కోయిల్ సాగర్ పనులు పూర్తి చేసి 32 వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చామని, ఈ నాలుగు ప్రాజెక్టుల కింద ఆరున్నర లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చామని హరీష్ రావు వివరించారు.

వలసలు, రైతు ఆత్మహత్యలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. బొంబాయి బస్సులు బంద్ అయ్యేలా చేసింది బిఆర్ఎస్ పార్టీ కాదా?, వాస్తవాలు కప్పి పెట్టి కెసిఆర్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి కాదా? అని అడిగారు. పాలమూరు ప్రాజెక్టును 80శాతం పూర్తి చేశామని, కాల్వలు పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలని, తాగు, సాగు, విద్య, పరిపాలనలో పాలమూరును అగ్రస్థానంలో నిలబెట్టింది కెసిఆర్ కాదా? అని అడిగారు. పాలమూరు 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని, 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ ఎందుకు ఏర్పాటు చేయలేదు అని హరీష్ రావు అడిగారు. చిత్తశుద్ధి ఉంటే ఆరు నెలల్లో నీళ్ల వాటా తేల్చే ప్రయత్నం చేయాలని, తాము పోరాటం చేసి కొత్త ట్రిబ్యునల్ ఏర్పడేలా చేశామని, నికర జలాలు తెలంగాణ అప్పుడు వస్తాయని, మంచి వాదనలు వినిపించాలని రేవంత్ ప్రభుత్వాన్ని సూచించారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ప్రజలను దృష్టి మరల్చే ప్రయత్నం సరికాదు అని హితువు పలికారు.  కాదు. ఓట్లు సీట్లే కాదు నిజాయతీగా పని చేయాలని రేవంత్ కు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News