Monday, November 25, 2024

రేవంత్…నీ పక్కనే మానవ బాంబులు

- Advertisement -
- Advertisement -

కాలం తెచ్చిన కరువు కాదు..కాంగ్రెస్ తెచ్చిన కరువు కెసిఆర్‌ను బద్నాం చేయడానికే ఇంత చిల్లర రాజకీయం
మీరు ఐదేండ్లు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాం 90 రోజుల్లోనే ప్రజాభిమానాన్ని కోల్పోయిన కాంగ్రెస్
అధికారంలో ఉండి ఫ్రస్టేషన్ ఎందుకు?
కరీంనగర్ నుంచే లోక్‌సభ ఎన్నికల శంఖారావం : కెటిఆర్
మన తెలంగాణ/కరీంనగర్ బ్యూరో : ‘మానవ బాం బులు ఎక్కడో లేరు..రేవంత్ రెడ్డి.. నీ పక్కనే ఉన్నారు’అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. కరీంనగర్‌లో గురువారం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ నాయకుల, బిఆర్‌ఎస్ కదన భేరీ సన్నాహక సమావేశం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…ఖమ్మం, నల్లగొండ మానవ బాంబులే రేవంత్‌ను ఖతం చేస్తారని జోస్యం చెప్పారు. ప్రజలకు కూడా తెలియాలి ఎవరు గాడిదనో.. ఎవరు గుర్రమో.. రేవంత్ పాలన చూసిన తర్వాతనే మన నాయకుడి (కెసిఆర్) గొప్పతనం, ఆ విలువ ఏందో తెలుస్తది అన్నారు.

‘బిపి పెంచుకుని ఆగమాగం కాకు.. బిపి గోళీ వేసుకుని హా యిగా కూర్చో’ అని సిఎంకు సూచించారు. హా మీలు అమలు చేయకపోతే వెంట పడుతాం..వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ‘రేవంత్ మాట్లాడిన మాటలు అంతా వినే ఉంటారు, మూడు నెలలుగా ఆయన మాట లు ప్రజలు గమనిస్తున్నారు. ఆవేశంతో ఊగిపోతూ నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. అధికారంలో ఉండి ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారు’ అని మండిపడ్డారు. కాలం మంచిగా కాలేదు..కరువు వస్తున్నది.. అందరం కలిసి ఎదుర్కొందాం అని సిఎం అంటున్నారని, కానీ ఇది కా లం తెచ్చిన కరువు కానేకాదు..కాంగ్రెస్ తెచ్చిన కరువు అని తేల్చిచెప్పారు.

బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ముందుచూపుతోనే ఆ కరువు మీద సంధించిన బ్రహ్మాస్త్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలో రిపేర్లు చేసి ఉంటే చొప్పదండి, హుజురాబాద్, కరీంనగర్, మానకొండూరులో ఎండుతు న్న పంటలకు ఆ నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుండేదని అన్నారు. కెసిఆర్‌ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే ఎల్‌ఎండిని ఖాళీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. భవిష్యత్‌లో కరీంనగర్‌లో కూడా గొంతు ఎండుతది..డైలీ వాటర్ సప్లయి బంద్ అయితది అన్నారు. కెసిఆర్‌ను బద్నాం చేయడానికి ఇంత చిల్లర రాజకీయం సరికాదు అని మండిపడ్డారు. ‘రాహుల్ గుజరాత్ మోడల్‌ను బేకార్ మోడల్, అట్టర్‌ఫ్లాప్ మోడల్ అని అంటారు…అదానీని పొట్టుపొట్టు తిడతారు. రేవంతేమో అదానీతో ఆలయ్ బలయ్ చేసుకుంటారన్నారు. దిక్కుమాలిన పనులు చేసిన రేవంత్ ప్రభుత్వం 90 రోజుల్లోనే ప్రజాభిమానాన్ని కో ల్పోయిందని అన్నారు. గుజరాత్ మోడల్ అంటే తెల్లారితే హిందువులు, ముస్లింలు తన్నుకోవడమా..? రైళ్లల్లో పోయేటోళ్లను కాల్చి చంపుడా? అని అన్నారు. అధికారంలోకి రాగానే రూ.15 వేలు రైతు బంధు వేస్తానని అన్నారని, రైతు భరోసా అన్నారని, కానీ భరోసా లభించలేదని, రైతులు మోసపోయి ఓట్లు వేశామని ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా.. ఆ ఫైలుపై డిసెంబర్ 9న సంతకం చేస్తానని ఇప్పటివరకు అమలు చేయలేదని ..ఎప్పుడు రుణమాఫీ చేస్తావు..? అని రేవంత్‌ను ప్రశ్నించారు.
దమ్ముంటే మల్కాజిగిరికి రా.. చూసుకుందాం
‘మగాడివైతే ఒక్క ఎంపి సీటు గెలిపించుకో అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. రాష్ట్రంలోని అన్ని సీట్లు కాదు.. దమ్ముంటే, సత్తా ఉంటే, మగాడివి అయితే.. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌కు రా.. సిఎం పదవికి నీవు రాజీనామా చేసి రా.. నేను సిరిసిల్ల ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేస్తాను. మల్కాజ్గిరిలోనే తేల్చుకుందాం అని కెటిఆర్ సవాల్ విసిరారు. ‘పంటలకు నీళ్లు ఇవ్వు.. రైతు భరోసా ఇవ్వు.. మ హాలక్ష్మి కింద మహిళలకు రూ. 2500 ఇస్తా అన్నావు.. దమ్ముంటే ఈ పనులు చేసి చూపించు అని డిమాండ్ చేశారు. గతంలోనూ సెక్రటేరియట్లో మాట్లాడుతూ.. ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చాను అని రేవంత్ అన్నారని, లంకెబిందెల కోసం ఎవరు తిరుగుతారు.. ఈ లంకె బిందెల కథ, జేబుల కత్తెర్ల కథ అర్థం కావడం లేదన్నారు.
కరీంనగర్ నుంచే ఎన్నికల శంఖారావం
ఈ నెల 12న బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ తిరిగి జంగ్ సైరన్ ఊదడానికి, కదనభేరి మోగించడానికి కరీంనగర్‌కు వస్తున్నారని తెలిపారు. ఆ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి పిలుపునిచ్చారు. కెసిఆర్‌కు కరీంనగర్ అంటే సెంటిమెంట్ అని, ఇక్కడ ఏ కార్యక్రమం ప్రారంభించిన విజయవంతం అవుతుందని నమ్మకం అన్నారు.
2001, మే 17న కరీంనగర్లోని ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ మైదానంలో సింహగర్జన నిర్వహించుకున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే మైదానం నుంచి కదనభేరి మోగించబోతున్నామని తెలిపారు. ఈ భారీ బహిరంగసభకు సంబంధించి పోస్టర్లు రిలీజ్ చేసుకున్నామని, ఈ పోస్టర్లు గ్రామాలకు, పట్టణాలకు వెళ్లాలని, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, మద్దతుదారులు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపి వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News