దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమేరకు ఈనెల 15న సునీత తన రాజకీయరంగ ప్రవేశంపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం. పులివెందులలోనే రాజకీయ ప్రకటన చేసేందుకు ఆమె ముందు నిర్ణయించుకున్నా, ఆ తర్వాత కడపకు మార్చుకున్నారు. పులివెందుల లేదా కడప నుంచి సునీతను గాని, ఆమె తల్లి సౌభాగ్యమ్మనుకానీ బరిలోకి దింపాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉంది.
తన తండ్రి హత్య కేసు విచారణలో అలవిమాలిన జాప్యం జరుగుతూ ఉండటంపై సునీత అసహనంగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డే ఇందుకు కారణమని, నిందితుల పట్ల ఆయన ఉదాసీన వైఖరి కనబరుస్తున్నారని ఆమె బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో ఆమె నేరుగా జగన్ పై విమర్శలు చేశారు. ఇదిలాఉండగా వివేకా హత్య కేసులో మొదటినుంచీ సునీతకు అండగా ఉంటున్న అతికొద్దిమందిలో ఆమె సోదరి షర్మిల ఒకరు. తాజాగా పిసిసి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన షర్మిల..సునీత టిడిపిలో చేరతానంటే ఒప్పుకోకపోవచ్చు. సునీత రాజకీయ ప్రవేశంపై షర్మిల ఇప్పటివరకూ స్పందించలేదు.