Monday, December 23, 2024

ఇందిరమ్మ ఇండ్ల పథకానికి నేడే అంకురార్పణ

- Advertisement -
- Advertisement -

గ్యారంటీల అమలులో మరో ముందడుగు

మనతెలంగాణ/హైదరాబాద్/ఖమ్మం : ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నేడు సిఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. భద్రాచలంలో ఈ పథకానికి ముఖ్యమంత్రి అంకురార్పణ చేయనున్నారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షల సాయం అందించాలని ప్ర భుత్వం సంకల్పించింది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్ర కారం ఆ రు గ్యారంటీల అమలులో భాగంగా ఈ పథకాన్ని సిఎం ప్రారంభించనున్నారు. ప్రజా పాలనలో దరఖాస్తులు నమోదు చేసుకున్న అర్హులకు ఈ పథ కం వర్తింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ద శలవారీగా రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులకు ఈ పథకం వర్తింపచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటి స్థలం ఉన్న వారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలను ప్రభుత్వం అందచేయనుంది. సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డి జైన్ల తయారీని ప్రభుత్వం ఇప్పటికే రూపొందించింది. అందు లో భాగంగా తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండే లా కొత్త ఇంటినిర్మాణ నమూనాలను తయారు చేయించింది.
నేటి సిఎం షెడ్యూల్ ఇలా…
సిఎం బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి 8.45కు బయలుదేరి యాదగిరిగుట్టకు చేరుకుంటారు. 9.30కు లక్ష్మీనరసింహా స్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయానికి 12 గంటలకు సిఎం చేరుకుంటారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని 1 నుంచి 2 గంటల మధ్య భద్రాచలంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గ్రౌండ్‌లో సిఎం ప్రారంభిస్తారు. అనంతరం 2 గంటల నుంచి 3.30 మధ్యలో భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి అభివృద్ధికి సంబంధించి అధికారులతో సిఎం సమీక్ష జరుపుతారు. అక్కడి నుంచి మణుగూరు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని అక్కడి నుంచి సాయంత్రం 6.10 నిమిషాలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు.
కేంద్ర సహకారం కోసం…
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి పట్టణాల్లో నిర్మించే గృహ నిర్మాణాలకు కేంద్ర సహకారాన్ని తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కేంద్రం అమలు చేస్తున్న అందరికీ ఇళ్లు పథకం కింద కొంత మేర నిధులను సమీకరించడం ద్వారా ముందడుగు వేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇళ్లు నిర్మించే పక్షంలో తాము రూపొందించిన లోగోను విధిగా ముద్రించాలన్నది కేంద్రం విధించిన షరతుల్లో ఒకటి కాగా, ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం లోగోను తయారు చేయించాలన్న ఆలోచనలో రాష్ట్ర సర్కారు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఉండే గోడలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లోగోలను ముద్రించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలిసింది. ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాల్లో కూడా ఈ అంశాన్ని పేర్కొనాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్టుగా తెలిసింది.
కేంద్రం నుంచి లక్షన్నర సాయం
ఇళ్ల నిర్మాణానికి కేంద్రం గతంలోనూ ఆర్థిక సాయం అందించింది. ఈ మేరకు గత ప్రభుత్వం నిర్మించిన రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి 2016, -17లో ఒకసారి రూ.1,100 కోట్ల మేర కేంద్రం నుంచి ఆర్థికసాయం అందింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల సమాచారాన్ని తాజాగా కేంద్ర వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ. 430 కోట్ల వరకు కేంద్రం నుంచి అందనున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం మార్గదర్శకాలు వేర్వేరుగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం విధించిన నిబంధనలు అనుకూలంగా లేవు. పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.లక్షన్నర వరకు సాయాన్ని అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆ మొత్తం తక్కువగా ఉండటంతో పాటు షరతులు అధికంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు కేంద్రం కేవలం రూ.72 వేలు మాత్రమే అందజేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలను వెచ్చించాలని నిర్ణయించగా ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో కేంద్రం ఇచ్చే రూ.లక్షన్నర మినహాయించి మిగిలిన మూడున్నర లక్షలను తెలంగాణ ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుంది.
సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొంగులేటి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ముందుగా భద్రాచలంలోని మార్కెట్ యార్డులో సిఎం పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా, ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శరత్, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ మంత్రి కి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి శ్రీకారం చుడతారని తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన ఆరు హామీలకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ కార్గే ప్రియాంక గాంధీ పేదలపై అభిమానంతో ఇచ్చిన ఆరు హామీల్లో నాలుగు హామీలు ప్రజల దరికి చేరాయని అన్నారు. ఐదవ హామీ పేద ప్రజానీకానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి పాదాల సన్నిధిలో లాంఛనంగా ప్రారంభించి అందిస్తారని అన్నారు. మణుగూర్‌లో జరిగే ప్రజా దీవెన సభకు పినపాక నియోజకర్గంలోని కార్యకర్తలంతా తరలి రావాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News