ప్రపంచ క్రికెట్‌పై టీమిండియా ముద్ర
మన తెలంగాణ/ క్రీడా విభాగం: ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా ఎదురులేని శక్తిగా మారింది. మూడు ఫార్మాట్‌లలోనూ భారత్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండడం దీనికి నిదర్శనంగా చెప్పాలి. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను రోహిత్‌సేన 41 తేడాతో సొంతం చేసుకుంది. ఈ విజయంతో సొంత గడ్డపై తనకు తిరుగులేదని విషయాన్ని మరోసారి చాటింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఆరంభ టెస్టులో ఓడిన భారత్ ఆ తర్వాత వరుసగా నాలుగింటిలో గెలిచి ఇంగ్లండ్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించింది. అన్ని మ్యాచ్‌లనూ దాదాపు నాలుగు రోజుల్లోనే భారత్ గెలవడం మరో విశేషంగా చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా అసాధారణ ప్రదర్శనతో అదరగొట్టింది.
చివరి రెండు టెస్టుల్లో అయితే ఇంగ్లండ్ కనీస పోటీ కూడా ఇవ్వకుండానే చేతులెత్తేసింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టు నుంచి అనూహ్యంగా పుంజుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తూ లక్షం దిశగా అడుగులు వేసింది. సిరీస్‌లో కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా భారత్ మాత్రం ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపించాడు. సారథిగానే కాకుండా బ్యాటర్‌గానూ సత్తా చాటాడు. యువ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారి నుంచి మెరుగైన ప్రదర్శనను రాబట్టాడు. సిరీస్ ఆరంభంలో పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరిచిన యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో రోహిత్ కీలక పాత్ర పోషించాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి పలు కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు.
అంతేగాక శుభ్‌మన్ గిల్‌లోనూ ఆత్మవిశ్వాసం పెరిగేలా తనవంతు సహకారం అందించాడు. ఇలా రోహిత్ మెరుగైన సారథ్యం సిరీస్‌లో బాగానే ప్రభావం చూపింది. తొలి మ్యాచ్‌లో ఓడినా భారత్ ఎక్కడ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. విశాఖ మ్యాచ్ నుంచి మెరుగైన ఆకట్టుకుంది. ఇదే క్రమంలో ఇంగ్లండ్ జోరుకు అడ్డుకట్ట వేస్తూ లక్షం దిశగా అడుగులు వేసింది. రాహుల్, షమి, జడేజా, బుమ్రా, కోహ్లి వంటి కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా టీమిండియా ఎక్కడ కూడా ఒత్తిడికి గురి కాలేదు. ఒక్కో మ్యాచ్‌లో గెలుస్తూ ముందుకు సాగింది. ఇదే సమయంలో వరుసగా నాలుగు మ్యాచుల్లోనూ గెలిచి సిరీస్‌ను దక్కించుకుంది.
సమష్టిగా ముందుకు..
సిరీస్‌లో భారత్ ఘన విజయం సాధించిందంటే దానికి ప్రధాన కారణం సమష్టి పోరాటమేనని చెప్పాలి. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ భారత ఆటగాళ్లు ముందుకు సాగారు. ముఖ్యంగా యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌ల బ్యాటింగ్‌ను ఎంత పొగిడినా తక్కువే. యశస్వి అయితే సిరీస్‌లో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు బాదేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పరుగుల వరద పారించాడు. శుభ్‌మన్ గిల్, జడేజాలు కూడా బ్యాట్‌తో మెరుపులు మెరిపించారు. యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్‌దీప్‌లు అందివచ్చిన అవకాశాన్ని అనుకూలంగా మార్చుకున్నారు. సీనియర్లు అశ్విన్, జడేజా, బుమ్రా, కుల్దీప్‌లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టారు. అద్భుత బౌలింగ్‌తో జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు. ఇలా సీనియర్లు, జూనియర్లు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంతో భారత్ సిరీస్‌లో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.