Monday, December 23, 2024

హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తమను అనర్హులుగా ప్రకటిస్తూ అసెంబ్లీ స్పీకర్ జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టులో ఎందుకు సవాలు చేయలేదని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను మంగళవారం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు వారిపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేశారు. బడ్జెట్‌పై జరిగే ఓటింగ్‌లో పాల్గొనాలని తాము జారీచేసిన విప్‌ను ధిక్కరించినందుకు తమ పార్టీకి చెందిన ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై చర్యలు కోరుతూ కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదుపై హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా ఫిబ్రవరి 29న వారిని అనర్హులుగా ప్రకటించారు.

స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తిరుగుబాటు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరఫున వాదించాల్సి ఉన్న సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే నేడు రాలేకపోయారని, ఈ కారణంగా ఈ కేసు విచారణను మార్చి 15 లేదా మార్చి 18వ తేదీకి వాయిదా వేయాలని మరో న్యాయవాది కోరారు. దీనిపై జస్టిస్ ఖన్నా స్పందిస్తూ అసలు హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదో ముందు సమాధానం చెప్పండి అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన కారణాలను పిటిషనర్లు తమ పిటిషన్‌లో వివరించారని, వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని న్యాయవాది తెలుపగా అదేమీ ప్రాథమిక హక్కు కాదని న్యాయమూర్తి అన్నారు.

ఇదో అరుదైన కేసని, ఎమ్మెల్యేలలపై 18 గంటల్లోనే స్పీకర్ అనర్హత వేటు వేశారని న్యాయవాది తెలియచేశారు. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.రాష్ట్ర స్పీకర్ పఠానియాతోపాటు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హర్షవర్ధన్ చౌదరి, ఇతరులను పిటిషనర్లు తమ పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. ఫిబ్రవరి 27న జరిగిన రాజ్యసభ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు అనుకూలంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఈ ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు రాష్ట్ర బడ్జెట్‌పై ఓజరిగిన ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. ఈ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ కారణంగా కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి ఓటమిపాలయ్యారు. దీంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలు రాజీందర్ రానా, సుధీర్ శర్మ, ఇందర్ దత్ లఖన్‌పాల్, దేవీందర్ కుమార్ భుటూ, రవీ ఠాకూర్, చేతన్య శర్మలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News