పోర్టులూయిస్ : చారిత్రక దండి సత్యాగ్రహ వార్షికోత్సవం సందర్భంగా మారిషస్‌లో మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్‌ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం సందర్శించి, మహాత్మునికి నివాళులు అర్పించారు. 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్ 5 వరకు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ శాసనోల్లంఘన ఉద్యమం చేపట్టారు. అహ్మదాబాద్ లోని సబర్మతీ ఆశ్రమం నుంచి కోస్తా తీర గ్రామం దండి వరకు దండియాత్ర సాగించి ఉప్పు సత్య్గాగ్రహాన్ని నిర్వహించారు. అందుకనే మార్చి 12 మంగళవారం చారిత్రక దినంగా గుర్తింపు పొందింది.
మారిషస్‌లో మూడు రోజుల పర్యటనకు ముర్ము విచ్చేసారు. మారిషస్ లోని మోకాలో మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ వద్ద పౌరస్వాగత సభ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మహాత్మాగాంధీ సార్వజనీన ఆదర్శాలను గుర్తు చేసుకున్నారని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మంగళవారం మారిషస్ జాతీయ దిన వార్షికోత్సవం కావడంతో ముర్ము ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మా గాందీ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైలులో కొద్దిసేపు ప్రయాణించారు. భారత సహాయ ప్రాజెక్టు అయిన మారిషస్ మెట్రో అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. 2019లో ప్రధాని మోడీ, మారిషస్ ప్రీమియర్ ప్రవింద్ జుగ్‌నాథ్ కలిసి ఉమ్మడిగా మారిషస్‌లో మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌తోపాటు , ఆస్పత్రిని వీడియో ద్వారా ప్రారంభించారు.