Monday, December 23, 2024

5 మహిళా న్యాయ్ గ్యారంటీలను ప్రకటించిన రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

ధూలె (మహారాష్ట్ర) : రానున్న లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే ఐదు ‘మహిళా న్యాయ్’ గ్యారంటీలు ఇస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బుధవారం ప్రకటించారు. ఆ గ్యారంటీలలో భాగంగా నిరుపేద మహిళలకు ఏటా లక్ష రూపాయలు ఇస్తామని, ప్రభుత్వ ఉద్యోగాలలో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని రాహుల్ వాగ్దానం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పక్షంలో రిజర్వేషన్‌పై 50 శాతం పరిమితి రద్దుకు రాజ్యాంగ సవరణ తీసుకువస్తుందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కమ్యూనికేషన్ల ఇన్‌చార్జి జైరామ్ రమేష్ హామీ ఇచ్చారు. తన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా ధూలె జిల్లాలో మహిళా ర్యాలీలో ప్రసంగించిన రాహుల్ గాంధీ ఐదు ‘మహిళా న్యాయ్’ గ్యారంటీలు ప్రకటించారు.

నిరుపేద మహిళల బ్యాంకు ఖాతాల్లో ఏటా లక్ష రూపాయలు డిపాజిట్ చేయనున్నట్లు, తమ పార్టీ ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు ఆయన తెలియజేశారు. ఆశా (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ ఏక్టివిస్ట్) కార్మికులు, అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజన పథకాలలో పని చేసే మహిళలకు సంబంధించిన బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ వాటాను రెట్టింపు చేయనున్నట్లు రాహుల్ వాగ్దానం చేశారు. మహిళల హక్కుల గురించి వారికి బోధపరిచేందుకు, కేసులపై పోరులో సాయం చేసేందుకు నోడల్ అధికారి ఒకరిని నియమించనున్నట్లు ఆయన తెలిపారు. తన ఐదు గ్యారంటీలను వివరించిన రాహుల్ గాంధీ దేశంలోని ప్రతి జిల్లాలో మహిళల కోసం సావిత్రిబాయ్ ఫూలె హాస్టళ్లు ఏర్పాటు చేయగలమని తెలియజేశారు.

అన్యాయం కారణంగా దౌర్జన్యకాండ, విద్వేషం ఎదుర్కొంటున్నామని రైతులు, యువజనులు, మహిళలు తనతో చెప్పిన తరువాత మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు తన రెండవ దశ యాత్రలో ‘న్యాయ్’ పదం చేర్చినట్లు రాహుల్ వివరించారు. పారిశ్రామికవేత్తలకు సంబంధించి రూ. 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని, కాని రైతులు, యువత రుణాల మాఫీ జరగలేదని ఆయన ఆరోపించారు. ‘దీనికి మించిన అన్యాయం ఏదీ ఉండదు’ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ‘భాగీదారీ’ (భాగస్వామ్యం) ప్రతిపాదన అంటే తమ జనాభా ప్రకారం విధాన నిర్ణయంలో, వనరుల పంపకంలో అన్ని కులాలు, తెగలను సమ్మిళితం చేయడం అని రాహుల్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News