Sunday, January 19, 2025

ఎన్‌ఆర్‌సితో సిఎఎ అనుసంధానం

- Advertisement -
- Advertisement -

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి)తో అనుసంధానించారని, కొత్త చట్టాన్ని తాను వ్యతిరేకించడానికి అదే కారణం అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) చీఫ్ మమతా బెనర్జీ బుధవారం చెప్పారు. అస్సాంలో వలె పశ్చిమ బెంగాల్‌లో నిర్బంధ శిబిరాల ఏర్పాటును తాను కోరడం లేదని మమత జల్పాయిగురిలో విలేకరులతో చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు సిఎఎ ‘రాజకీయ ఎత్తుగడ’ అని కూడా ఆమె వ్యాఖ్యానించారు. మమత అంతకు ముందు జల్పాయిగురిలో పాలనాయంత్రాంగం సమావేశంలో ప్రసంగిస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పౌరసత్వం మంజూరు ప్రక్రియ ఇతర దేశాలలోని విధానానికి భిన్నం అని పేర్కొన్నారు. సిఎఎ పరిధిలో నుంచి ముస్లింలను మినహాయించడాన్ని మమత విమర్శించారు.

దేశ జనాభాలో చీలికల సృష్టి ఆ చట్టం లక్షం అని ఆమె ఆరోపించారు. ‘దేశ ప్రజలను విభజించడం లక్షంగా సిఎఎ తెచ్చారు’ అని ఆమె అన్నారు. సిఎఎ దరఖాస్తు ప్రక్రియ, ప్రజల హక్కులపై దాని ప్రభావంపై మమత ఆందోళన వ్యక్తం చేస్తూ, పశ్చిమ బెంగాల్ ప్రజల హక్కుల పరిరక్షణకు తన ప్రభుత్వం నిబద్ధమై ఉందని స్పష్టం చేశారు. ‘మేము భూస్వాములం కాము. కానీ అప్రమత్తమైన పరిరక్షకులం. పశ్చిమ బెంగాల్ నుంచి ఏ ఒక్కరికీ ఉద్వాసన జరగదు. కాందిశీకులు అందరికీ ఇక్కడ శాశ్వత వసతి లభిస్తుంది’ అని ఆమె వాగ్దానం చేశారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) తీరును కూడా మమత ఎండగట్టారు. ఆ పార్టీ ‘హిందుత్వానికి తప్పుగా భాష్యం చెబుతోందని ఆమె ఆరోపించారు. ‘బిజెపి హిందుత్వ భావన వేదాలు, స్వామి వివేకానంద భోధనలకు భిన్నమైనది’ అని మమత వాదించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News