మాజీ ఎస్‌ఐబి డిఎస్‌పి ప్రణీత్ రావు కేసులో బుధవారం కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను ప్రభుత్వం సిట్‌కు అప్పగిం చింది. జూబ్లీహిల్స్ ఎసిపిని విచారణ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రణీత్ రావు పలువురి ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. గతంలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఈ విషయమై ఆరోపణలు చేసిన విషయం విదితమే. బిజెపి నేతలు కూడ తమ ఫోన్లు ట్యాపింగ్‌కు గురౌతున్నాయనే అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణీత్‌రావుపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రణీత్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రణీత్ రావును సిరిసిల్లలో పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల అంశానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటాను ప్రణీత్‌రావు ధ్వంసం చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ అంశానికి సంబంధించి విచారణ చేసేందుకు జూబ్లీహిల్స్ ఎసిపి నేతృత్వం లో నలుగురు సభ్యులతో సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది . ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుండి ఇప్పటివరకు దర్యాప్తు వివరాలను సిట్ బృందం తీసుకోనుంది. ఇక నుండి సిట్ బృందం ప్రణీత్ రావును విచారించనుంది. ఆధారాలు ద్వంసం చేయాలనే ఆదేశాలను ప్రణీత్‌రావుకు ఎవరు ఇచ్చారన్న దానిపైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు బంధువే ఈ ప్రణీత్‌రావు కావడంతో ఆ దిశగానూ విచారణకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ప్రణీత్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన డిఎస్‌పి గంగాధర్
రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్, రికార్డుల ధ్వంసం వ్యవహారంలో సస్పెండ్ అయిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబి) మాజీ డిఎస్‌పి ప్రణీత్ రావుపై డిఎస్‌పి గంగాధర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రణీత్ రావు అడ్డదారిలో ప్రమోషన్ పొందారన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖలో దొడ్డిదారిన యాక్సిలరేటెడ్ ప్రమోషన్ పొందిన నలుగురు అధికారుల్లో ప్రణీత్ కూడా ఉన్నారంటూ ప్రభుత్వానికి గంగాధర్ ఫిర్యాదు చేశారు. ఈ అధికారుల ప్రమోషన్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం కావలసిన అధికారులకు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రమోషన్ ఇచ్చిందని ఆరోపించారు. మావోయిస్టులతో ముడిపడిన ఆపరేషన్స్‌లో చురుకుగా వ్యవహరించిన అధికారులకు గతంలో యాక్సిలరేటెడ్ ప్రమోషన్లు ఇచ్చేవారని గుర్తుచేశారు. అయితే ప్రణీత్ రావు ఎలాంటి నక్సలైట్ సంబంధిత ఆపరేషన్ చేయకుండానే డీఎస్‌పిగా ప్రమోషన్ ఇచ్చారని ఫిర్యాదులో ఆరోపించారు.