Sunday, December 22, 2024

విలేకరుల బ్లాక్‌మెయిలింగ్‌కు కుటుంబం బలి

- Advertisement -
- Advertisement -

నార్సింగి: చైన్ సిస్టం స్కీం ద్వారా ఆర్థ్ధికంగా మోసపోవటంతోపాటు వేధింపులు తాళలేక ముగ్గురు కొడుకులకు ఉరివేసి అనంతరం తను కూడా బలవన్మరణానికి పాల్పడ్డ సంఘటన శంకర్‌పల్లి మండలం మోకిల పోలీసు స్టేషన్ పరిధిలోని టంగటూర్ గ్రామంలో జరిగింది. నార్సింగి పోలీసుస్టేషన్‌లో బుధవారం డిసిపి చింతమనేని శ్రీనివాస్ ఆధ్వరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఘటనకు సంబంధించిన విషయాలను ఆయన వెల్లడించారు. నీరటి రవి వృత్తి రీత్యా జుల్‌కల్‌లోని అగ్రికల్చర్ ఆఫీస్‌లో సూపర్ వైజర్‌గా పని చేసేవాడు. 2022వ సంవత్సరంలో రవి కంపెనీ పని నిమిత్తం గుంటూరు వెళ్ళగా అక్కడ తిరుపతిరావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తిరుపతిరావు పని చేస్తున్న జిఎస్‌ఎన్ ఫౌండేషన్ మనీ సర్కులేషన్ విజయనగరానికి సంబంధించిన సంస్థ స్కీంల గురించి వివరించి అందులో చేరితే వచ్చే లాభాలను రవికి వివరించి ఆ సంస్థలో రవిని సభ్యునిగా చేర్పించాడు. ఈ సంస్థలో ముందుగా 2000 రూపాయలు కడితే 45 రోజుల తరువాత కట్టిన డబ్బులు పూర్తిగా తిరిగి ఇవ్వటమే కాకుండా

నెలకు వెయ్యి రూపాయలు చొప్పున 6 నెలల వరకు అదనంగా ఇవ్వటంతో రవి తాను చేరటమే కాకుండా ఆ ఊరిలో వారితోపాటు తనకు తెలిసిన వారందరితో చాలా మొత్తంలో సభ్యత్వాలు చేసి పెద్ద మెత్తంలో డబ్బుని సంస్థకు కట్టించాడు. అనంతరం సేకరించిన డబ్బుని తిరుపతిరావుకు పంపగా, తిరిగి ప్రతి నెల రవికి పంపగా రవి సభ్యులకు డబ్బులను చెల్లించేవాడు. ఈ క్రమంలో వ్యాపారం సజావుగా సాగటంతో 8 నెలల క్రితం రవి 0.39 గుంటల భూమి కొనుగోలు చేసి తన ముగ్గురు పిల్లల పేరిట ఆ స్థలంలో ఎస్‌ఎన్‌యు ఫంక్షన్ హాల్‌ను కట్టిస్తున్నాడు. ఈ క్రమంలో జిఎస్‌ఎన్ ఫౌండేషన్ మని సర్కులేషన్ నుంచి గత మూడు నెలలుగా డబ్బులు రాకపోవటంతో రవిని గ్రామస్తులు చుట్టు ప్రక్కల గ్రామాల వారు తరచూ అడుగుతూ ఒత్తిడి చేయటం ప్రారంభించారు. ఈ విషయం అందరికి తెలియటంతో స్థానిక విలేకరులు అయిన ఎబిఎన్ రిపోర్టర్ శ్రీనివాస్, ఈనాడు రిపోర్టర్ శ్రీనివాస్, నమస్తే తెలంగాణ రిపోర్టర్ మహేశ్, సాక్షి రిపోర్టర్ ప్రవీణ్, వార్త రిపోర్టర్ శ్రీనివాస్ రెడ్డిలు రవిని కలిసి జిఎస్‌ఎన్ ఫౌండేషన్

మనిసర్కులేషన్ ద్వారా ప్రజలకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నావని అంతే కాకుండా తాను నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ ప్రభుత్వ స్థలంలో ఉందని దీనిని తమ పత్రికలలో వార్త కథనాలు రాస్తామని బెదిరించి అతని వద్ద నుండి 20 లక్షలు రూపాయలు డిమాండ్ చేయటంతో 19వ తేదీన తన భార్య పుస్తెల తాడు తాకట్టు పెట్టి 2 లక్షల 50 వేల రూపాయలు తెచ్చి విలేకరులకు ఇచ్చాడు. ఆ తరువాత రవి భార్య ఈ విషయంలో గొడవపడి తన పుట్టింటికి తన చిన్న కొడుకుని తీసుకుని వెళ్ళిపోయిం-ది. ఈ క్రమంలో శంకర్‌పల్లి గ్రామంలో నివసించే హోంగార్డు నాగరాజు భార్య మనీల కూడా ఈ సంస్థలో సభ్యురాలిగా ఉండటంతో ఆమెకు కూడా -డబ్బులు రాకపోవటంతో రవిని ఒత్తిడి చేయగా తన భార్య పేరిట రావులపల్లి గ్రామంలో ఉన్న రెండు ప్లాట్లను 18 లక్షల రూపాయలకు అమ్మగా వచ్చిన డబ్బుని నాగరాజుకు ఇచ్చాడు. ఆ తరువాత మళ్లీ విలేకరుల నుంచి వత్తిడి ఎక్కువ అవ్వటంతో విసుగు చెందిన రవి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగానే మార్చి 3వ తేదీన తాను ఒక్కడే చనిపోతే

తన పిల్లలు అనాధలు అవుతారని తన ముగ్గురు పిల్లలను ఇంటికి తీసుకువచ్చి వారికి ఉరి వేసి అనంతరం తాను నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ దగ్గర రేకుల షెడ్డులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అప్పటి నుంచి కేసు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ఐదుగురులో రిపోర్టులలో ఇద్దరిని రిమాండ్ చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా డిసిపి చింతమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు ఇప్పటికైనా ఇటువంటి మోసపూరితమైన స్కీంల మాయలో పడి కోట్ల రూపాయల డబ్బు పోగొట్టుకోవటమే కాకుండా ప్రాణాలు సైతం కోల్పోవటం చాలా బాధాకరమన్నారు. ఈ విషయంలో పోలీసుశాఖ ఎన్నో అవగాహన కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నప్పటికి ప్రజలలో మార్పు రాకపోవటం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి మోసాలపై అవగాహన తెచ్చుకొని ఇటువంటి వాటిని ఎవరైనా ప్రోత్సహించిన వెంటనే తమకు తెలియచేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఈ సందర్బంగా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News