ఉప్పల్‌లో రెండు మ్యాచ్‌లు
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రతిష్ఠాత్మకమైన ఐపిఎల్ టి20 టోర్నమెంట్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. 2024 ఐపిఎల్ సీజన్ తొలి విడత షెడ్యూల్‌లో హైదరాబాద్‌కు రెండు మ్యాచ్‌లు నిర్వహించే ఛాన్స్ దొరికింది. ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన రెండు హౌం గ్రౌండ్ మ్యాచ్‌లను ఆడనుంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లతో హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌లను ఎలాగైనా చూడాలనే పట్టుదలతో క్రికెట్ ప్రేమీకులు ఉన్నారు. ఈ మ్యాచ్‌లపై ఇప్పటికే సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు బలమైన జట్లతో హైదరాబాద్ తలపడాల్సి ఉండడంతో ఈ మ్యాచ్‌లకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఇటు ముంబై, అటు చెన్నై జట్టులో పలువురు స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.
తమ అభిమాన ఆటగాళ్ల ఆటను ప్రత్యక్షంగా చూడాలనే లక్షంతో అభిమానులు ఉన్నారు. ఈసారి ఎలాగైనా మ్యాచ్‌ను చూడాలని భావిస్తున్న అభిమానులు టికెట్లను ఎలా సంపాదించాలనే దానిపై దృష్టి సారించారు. ఇప్పటికే తమకు తెలిసిన హెచ్‌సిఎ పెద్దల ద్వారా టికెట్లను సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. కాగా, హైదరాబాద్‌లో ఏ మ్యాచ్ జరిగినా టికెట్ల విక్రయాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరగడం పరిపాటిగా మారింది. టికెట్ల అమ్మకాలు ఎప్పుడూ ప్రారంభవుతాయో ఎప్పుడు పూర్తవుతాయో ఎవరికీ అంతుబట్టదు. క్షణాల్లోనే వేలాది టికెట్లు అమ్ముడైపోతాయి. సామన్య అభిమానుల టికెట్లు దక్కడం దాదాపు అసాధ్యమేనని చెప్పాలి. ఉప్పల్‌లో ఐపిఎల్ మ్యాచ్‌లు జరిగినా, అంతర్జాతీయ పోటీలు నిర్వహించినా ఎప్పుడు టికెట్ల విక్రయాలకు సంబంధించి పెద్ద వివాదమే నెలకొంటోంది. ఈసారి ఐపిఎల్ తొలి విడతలో హైదరాబాద్‌కు రెండు మ్యాచ్‌లు దక్కాయి. ఈ మ్యాచ్‌లను చూడాలనే లక్షంతో తెలుగు రాష్ట్రాల అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
మార్చి 27న ముంబై ఇండియన్స్‌తో, ఏప్రిల్ ఐదున చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)తో హైదరాబాద్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లను చూసేందుకు టికెట్లు దొరుకుతాయా లేదా అనేది అభిమానుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) పెద్దలు మాత్రం ఈసారి టికెట్ల విక్రయాల్లో ఎలాంటి అక్రమాలు జరుగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో హెచ్‌సిఎ పెద్దలు ఉన్నారు.