యువతరం మినహా థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గిందనే చెప్పాలి. ఇప్పుడంతా ఓటీటీల్లోనే సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత పెద్ద సినిమా వచ్చినా.. ‘రేపు ఎలాగూ ఓటిటిలో వస్తుంది కదా’ అని ఓ నెల రోజులు ఆగి, ఓటిటిలోనే చూస్తున్నారు. వీటికి ఉన్న క్రేజ్ ను గమనించిన నిర్మాతలు తమ సినిమాలను నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద నటులు కూడా ఓటీటీల్లో వచ్చే మూవీలు, వెబ్ సిరీస్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే ఓటీటీల్లో వచ్చే కంటెంట్ లో అసభ్యత, అశ్లీలత ఎక్కువ ఉంటోంది. దాంతో ఇంటిల్లిపాదీ టీవీ ముందు కూర్చుని చూడాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం 18 ఓటీటీలపై కొరడా ఝళిపించింది. ఓటీటీకి చెందిన 19 వెబ్ సైట్లు, 10 యాప్ లు, 57 సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను కేంద్రం బ్లాక్ చేసింది.
నిషేధం వేటు పడిన ఓటీటీల్లో డ్రీమ్ ఫిల్మ్స్, వూవీ, యస్మా, అన్ కట్ అడ్డా, ట్రై ఫ్లిక్స్, ఎక్స్ ప్రైమ్, హంటర్, రాబిట్, ఎక్స్ ట్రా మూడ్, న్యూఫ్లిక్స్, బేషరమ్స్, నియోన్ ఎక్స్ వీఐపీ, మూడ్ ఎక్స్, హాట్ షాట్ విఐపి, ఫ్యూగీ, ప్రైమ్ ప్లే, మోజో ఫ్లిక్స్, చికోఫ్లిక్స్ ఉన్నాయి.