న్యూఢిల్లీ: పెంపుడు కుక్కల దాడుల ఉదంతాలు పెరిగిపోతున్న దృష్టా 23 జాతులకు చెందిన క్రూరమైన శునకాల అమ్మకాలను, పెంపకాన్ని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం గురువారం రాష్ట్రాలను ఆదేశించింది. నిషేధించిన శునకాల జాబితాలో పిట్‌బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్‌డాగ్, రాతీవీలర్, మస్టిఫ్స్ మొదలైనవి ఉన్నాయి. 23 జాతులకు చెందిన శునకాల పెంపకాన్ని నిషేధిస్తూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ఈ జాతుల శునకాలను పెంచుకుంటున్న పక్షంలో వాటి సంతానోత్పత్తిని నిరోధించడానికి వాటికి స్టెరిలైజ్ చేయించాలని కేంద్రం తెలిపింది.
కొన్ని జాతుల శునకాలను పెంపుడు శునకాలుగా, ఇతర అవసరాల కోసం ఉంచుకోవడాన్ని నిషేధించాలని కోరుతూ పౌరులు, పౌర సంఘాలు, జంతు సంరక్షణ సంస్థల నుంచి తమకు అనేక వినతులు అందాయని పశు సంవర్థక, పాడి పరిశ్రమ శాఖ తెలిపింది. 23 జాతులకు చెందిన శునకాలను క్రూరమైనవిగా, మనుషులకు ప్రమాదకరమైనవిగా కమిటీ గుర్తించింది. ఇందులో సంకర, క్రాస్ బ్రీడ్స్ కూడా ఉన్నాయి.
పిట్‌బుల్ టెర్రియర్, టోసాఇను, అమెరికన్ స్టఫార్డ్‌షైర్ టెర్రియర్, ఫిలా బాసిలీరో, డాగో అర్జింటీనో, అమెరికన్ బుల్ డాగ్, బేర్‌బేల్ కన్గల్, సెంట్రల్ ఏషియన్ షెపర్డ్ డాగ్, కాకసియన్ షెపర్డ్ డాగ్ మొదలైనవి కేంద్రం నిషేధించిన శునకాల జాబితాలో ఉన్నాయి. సౌత్ రష్యన్ సెపర్డ్ డాగ్, తోరన్‌జాక్, సర్‌ప్లానినాక్, జపనీస్ టోసా, అకితా మస్టిఫ్స్, టెర్రియర్స్, రోడేషియన్ రిడ్జ్‌బ్యాక్, కెనేరియో, అక్బాష్ డాగ్, మాస్కో గార్డ్ డాగ్, కేన్ కార్సో, బ్యాండాగ్ కూడా ఆ జాబితాలో ఉన్నాయి. ఈ జాతుల దిగుమతి, పెంపకం, అమ్మకాన్ని నిషేధించినట్లు కేంద్రం తెలిపింది.