కశ్మీరులో కొత్త చరిత్రకు మహారాష్ట్ర శ్రీకారం చుడుతోంది. మొట్టమొదటిసారి కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీరులో దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారిక భవనం నిర్మాణం కానున్నది. కశ్మీరులో మహారాష్ట్ర భవన్‌ను నిర్మించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రానికి చెందిన పర్యాటకులు, అధికారుల కోసం త్వరలోనే మహారాష్ట్ర భవన్‌ను నిర్మించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. జమ్మూ కశ్మీరులో 370వ రద్దు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇతర రాష్ట్రానికి చెందిన ప్రభుత్వం అక్కడ అధికారిక భవన్ నిర్మాణానికి పూనుకుంది.
ప్రత్యేక ప్రతిపత్తి రద్దు కాక ముందు జమ్మూ కశ్మీరులో శాశ్వత నివాసులు మాత్రమే అక్కడ భూమిని కొనుగోలు చేసే హక్కు ఉండేది. అయితే పరిశ్రమలు, ఇతరప్రాంతాలకు చెందిన ప్రజలకు అప్పటి ప్రభుత్వాలు 99 ఏళ్ల వరకు సుదీర్ఘ కాలానికి భూమిని లీజుకు ఇచ్చేవి. శ్రీగనర్ శివార్లలోని బుద్గామ్‌లో మహారాష్ట్ర భవన్ నిర్మాణం కోసం భూమి కొనుగోలుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. శ్రీనగర్ విమానాశ్రయానికి సమీపంలోని ఇచ్గామ్ వద్ద 2.5 ఎకరాల భూమిని ఇందుకోసం జమ్మూ కశ్మీరు ప్రభుత్వం కేటాయించింది. దీనికి రూ. 8.16 కోట్ల విలువను నిర్ణయించింది.