న్యూఢిల్లీ: చీలమండ గాయంతో బాధపడుతున్న భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి 15 రోజుల క్రితం శస్త్ర చికిత్స జరిదిన విషయం తెలిసిందే. ఆపరేషన్ జరిగిన 15 రోజుల తర్వాత షమీ తన గాయం గురించి అప్‌డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం తాను చికిత్స ప్రక్రియ తదుపరి దశ కోసం ఎదురు చూస్తున్నానని వెల్లడించాడు. గాయం నుంచి తాను వేగంగా కోలుకుంటున్నానని పేర్కొన్నాడు. అన్నీ సజావుగా సాగితే త్వరలోనే మళ్లీ మైదానంలోకి దిగుతాననే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన బిసిసిఐ పెద్దలకు, అభిమానులను, కుటుంబ సభ్యులకు, సహచర క్రికెటర్లకు షమీ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం నా కుట్లు తొలగించారు.
నొప్పి కూడా పెద్దగా లేదు. వైద్యులు ఏం చెబుతారనే దాని గురించి ఎదురు చూస్తున్నా. వారిచ్చే సలహాలు, సూచనల ప్రకారం ముందుకు సాగుతానని వివరించాడు. ఇదిలావుంటే షమీకి శస్త్ర చికిత్స జరగడంతో అతను త్వరలో జరిగే ఐపిఎల్‌తో పాటు టి20 ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్ ద్వారా అతను మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని బిసిసిఐ కార్యదర్శి జైషా స్వయంగా వెల్లడించారు. కాగా, భారత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో షమీ అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.