Friday, November 22, 2024

కాంగ్రెస్‌కు క్యూ కట్టిన నేతలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీకి రోజురోజుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. బిఆర్‌ఎస్ పార్టీలోని సిట్టింగ్ ఎంపి, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి క్యూ కడుతున్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో ఇలాంటి కీలక పరిణామాలు చోటుచేసుకోవడంతో ఒకింత బిఆర్‌ఎస్ పార్టీకి ఇబ్బందులేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వరుసగా బిఆర్‌ఎస్‌కు చెందిన ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరడానికి ఉత్సాహం చూపుతుండడం తో పార్లమెంట్ టికెట్‌ల కోసం పోటాపోటీ నెలకొంది. ఇప్పటికే కొందరు బిఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరకముందే ఢిల్లీలోని ఏఐసిసి వద్దకు బారులు తీరుతున్నారు. కొందరి చేరికలపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అభ్యంత రం వ్యక్తం చేస్తుండడంతో వారు ఏఐసిసి నుంచి గ్రీన్‌సిగ్నల్ తీసుకొచ్చుకోవడానికి ఢిల్లీలో లాబీయింగ్ చేస్తుండడం  విశేషం. ఇప్పటికే బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ (సికింద్రాబాద్), నీలం మధులు (మెదక్), సునీతా మహేందర్ రెడ్డి (చేవెళ్ల) ఎంపి టికెట్‌ల కోసం పోటీ పడుతుండగా వీరితో పాటు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి ఉత్సాహం చూపుతుండడం విశేషం. ఇప్పటికే బిజెపికి చెందిన మాజీ ఎంపి జితేందర్ రెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది.
రంగారెడ్డి ఖాళీ అయ్యే అవకాశం…!
ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో బిఆర్‌ఎస్ నాయకులంతా కాంగ్రెస్‌లోకి వస్తుండడంతో అక్కడ ఆ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే బిఆర్‌ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే పార్టీని విడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.
త్వరలోనే సిఎంతో భేటీలు
అదే తరహాలో ప్రస్తుతం చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. చేవెళ్ల ఎంపి టికెట్‌ను సునీతా మహేందర్ రెడ్డికి ఇవ్వాలని మొదట్లో కాంగ్రెస్ పార్టీ భావించినా సర్వేలు మాత్రం బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపి రంజిత్‌రెడ్డికి అనుకూలంగా ఉండడంతో ఆయనకు కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా తెలిసింది. అయితే శుక్రవారం ఎంపి రంజిత్‌రెడ్డికి సిఎం రేవంత్ వెళతారని పార్టీ వర్గాలు ప్రకటించినా సిఎం రేవంత్ వెళ్లలేదని తెలిసింది. త్వరలోనే సిఎంను ఎంపి రంజిత్‌రెడ్డి కలిసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
రంజిత్ రెడ్డికే చేవెళ్ల ఎంపి టికెట్..?
చేవెళ్ల ఎంపి టికెట్ కోసం ఇప్పటికే చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి టికెట్ ఆశించారు. సునీత మహేందర్ రెడ్డి, కిచ్చన్న గారి లకా్ష్మరెడ్డిలకు వ్యతిరేకంగా, సిట్టింగ్ ఎంపి రంజిత్ రెడ్డికి సానుకూలంగా నివేదిక రావడంతో కాంగ్రెస్ అధిష్టానం రంజిత్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా ఎంపి రంజిత్ రెడ్డి వెంట బిఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టుగా తెలిసింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బిఆర్‌ఎస్‌లోకి యాదయ్య వెళ్లారు. మళ్లీ 2018లో బిఆర్‌ఎస్ నుంచి గెలిచారు. ఇప్పుడు 2023ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచి యాదయ్య త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని స్థానికులు పేర్కొంటున్నారు. యాదయ్య ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డిని కలవడంతో పాటు తాను పార్టీలో చేరే విషయమై చర్చించినట్టుగా తెలిసింది.
ముఖ్యమంత్రితో వరంగల్ ఎంపి భేటీ
బిఆర్‌ఎస్ వరంగల్ సిట్టింగ్ ఎంపి పసునూరి దయాకర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శుక్రవారం కలుసుకున్నారు. వరంగల్ సిట్టింగ్ ఎంపిగా ఉన్న పసునూరి బిఆర్‌ఎస్ నుంచి మరోసారి అదే సీటును ఆశించి భంగపడ్డారు. తిరిగి పోటీ చేయాలని విశ్వ ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే వరంగల్ జిల్లా ఇన్‌చార్జీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రి కొండా సురేఖతో కలిసి సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
సిఎంను కలిసిన దానం
సిఎం రేవంత్‌రెడ్డితో బిఆర్‌ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శుక్రవారం భేటీ అయ్యారు. కాగా, ఈ భేటీలో ఏఐసిసి ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే దానం కాంగ్రెస్ పార్టీలో చేరతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే తాను సిఎంను మర్యాదపూర్వకంగా కలిశానని దానం నాగేందర్ పేర్కొన్నారు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1994, 1999, 2004 ఎన్నిలకల్లో ఆసిఫ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా దానం ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనంతరం కొణిజేటి రోశయ్య హయాంలోనూ మంత్రిగా దానం కొనసాగారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఖైరతాబాద్ నుంచి పోటీచేసి చింతల రామచంద్రారెడ్డిపై ఓడిపోయారు.

Leaders lined up for Congress

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News