పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుపై స్టే విధించాలని కోరుతూ ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ శనివారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ చట్టం రాజ్యాంగ సాధికారతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకైనా స్టే విధించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం మార్చి 11న పౌరసత్వ సవరణ చట్టం 2019 ని అమలు చేసి , నాలుగు నిబంధనలను నోటిఫై చేసింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, నుండి భారత్‌కు ఎలాంటి పత్రాలు లేకుండా వచ్చిన ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం ఇవ్వడం సీఎఎ ముఖ్య ఉద్దేశం . ఈ చట్టం లోని కొన్ని నిబంధనల చెల్లుబాటును సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు
చేసిన పిటిషన్‌దారుల్లో ఓవైసీ ఒకరు. విచారణ పెండింగ్ సమయంలో పౌరసత్వ చట్టం 1955 సెక్సన్ 6 బి ప్రకారం పౌరసత్వం మంజూరు కోరుతూ ఏ దరఖాస్తు రాకపోవడంపై మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా కూడా ఓవైసీ తన పిటిషన్‌లో కోరారు. సిఎఎని ఎన్‌పిఆర్ (నేషనల్ పాప్యులేషన్ రిజిస్టర్ ), ఎన్‌ఆర్‌సి (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్)తో కలిపి చూడాలని ఓవైసీ కోరు. ఈ పిటిషన్లపై మార్చి 19న విచారించడానికి , సిఎఎ అమలును ఆపాలని కేంద్రానికి సూచించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ( ఐయుఎంఎల్) , మరో ముగ్గురు పిటిషన్ దారులు, డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా సుప్రీం కోర్టుకు పిటిషన్లు దాఖలు చేశారు.