న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మకమైన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) ఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానం వేదికగా ఆదివారం తుదిపోరు జరుగనుంది. ఈ ఫైనల్లో కిందటి రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఢిల్లీ వరుసగా రెండోసారి ఫైనల్లో ఆడనుంది. కిందటిసారి జరిగిన ఫైనల్లో ముంబై చేతిలో ఢిల్లీ ఓటమి పాలైంది. మరోవైపు బెంగళూరు తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో గెలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. ఢిల్లీ లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. బెంగళూరు శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైని ఓడించి ఫైనల్‌కు దూసుకొచ్చింది. లీగ్ దశలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఒక పరుగు తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.
బెంగళూరు కూడా లీగ్ దశలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో బలమైన ముంబైని ఓడించడంతో బెంగళూరు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఫైనల్లో కూడా అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమైంది. కెప్టెన్ స్మృథి మంధాన, సోఫి డివైన్, ఎలిసె పేరీ, రిచా ఘోష్ తదితరులతో బెంగళూరు బ్యాటింగ్ బలంగా ఉంది. కిందటి మ్యాచ్‌లో పేరీ మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచింది. ఈసారి కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. బౌలింగ్‌లో కూడా బెంగళూరు బాగానే కనిపిస్తోంది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 135 పరుగుల స్కోరును కూడా కాపాడుకుని జట్టును ఫైనల్‌కు చేర్చడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో కూడా బౌలర్లు జట్టుకు కీలకంగా మారారు.
ఇక, ఢిల్లీలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. కెప్టెన్ మెగ్ లానింగ్, షఫాలీ వర్మ, అలైస్ కాప్సె, జెమీమా రోడ్రిగ్స్, మరిజానే కాప్, సదర్లాండ్ వంటి స్టార్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. లానింగ్, కాప్సె, రోడ్రిగ్స్, షఫాలీలు తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే బెంగళూరు బౌలర్లకు కష్టాలు ఖాయం. బౌలింగ్‌లో కూడా ఢిల్లీ బలంగా ఉంది. కాప్, శిఖా పాండే, సదర్లాండ్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.