Saturday, January 11, 2025

ఆప్ లీడర్లతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడ్డారు: ఇడి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంఎల్‌సి కవిత అరెస్టుపై దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు పేర్కొంది. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశామని.. మొత్తం రూ.128.79 కోట్లు సీజ్ చేశామని వెల్లడించింది. మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్‌తో పాటు పలువురు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారని వివరించింది.

ఈ నెల 23 వరకు కవితకు న్యాయస్థానం రిమాండ్ విధించిందని ఇడి పేర్కొంది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు కవితను ఏడు రోజుల కస్టడీకి అనుమతించిందని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నెల 23వ తేదీ వరకు కవిత ఇడి కస్టడీలో ఉంటుందని వెల్లడించింది. కవిత ఇంట్లో ఈ నెల 15న సోదాలు నిర్వహించామని, ఆ సమయంలో కవిత బంధువులు ఆటంకం కలిగించారని ఆ ప్రకటనలో వెల్లడించింది. ఆప్ లీడర్లతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు తేలిందని ఇడి స్పష్టం చేసింది. రూ.100 కోట్ల మొత్తాన్ని ఆప్ నాయకులకు చేర్చడంలో కవిత కీలక పాత్ర పోషించారని ప్రకటనలో వెల్లడి చేసింది.

కెటిఆర్, హరీష్ రావు ములాఖత్
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సోమవారం సాయంత్రం ఇడి కార్యాలయానికి వెళ్లారు. ములాఖత్‌లో భాగంగా వీరిద్దరు కవితను ఇడి కేంద్ర కార్యాలయంలో కలిశారు. కవితను ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కలిసేందుకు కోర్టు అనుమతించింది. మరోవైపు కవితతో ములాఖత్ కోసం భర్త అనిల్ రాలేదు. ఆయనకూ ఇడి నోటీసులు జారీ చేసింది. తాను విచారణకు హాజరు కాలేనని ఇడికి లేఖ రాశారు. పది రోజుల వరకు ఇడి కార్యాలయానికి రాలేనని లేఖలో పేర్కొన్నట్లుగా సమాచారం. అందుబాటులో ఉండి ఇడి విచారణక హాజరు కాలేదన్న అభిప్రాయం వస్తుందనే ఆయన ములాఖత్‌కు దూరంగా ఉన్నట్లుగా భావిస్తున్నారు.

ఇడిపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్
దర్యాప్తు సంస్థ ఇడిపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ ఎంఎల్‌సి కవిత దాఖలు చేశారు. సుప్రీం కోర్టులో ఢిల్లీ లిక్కర్ కేసుకి సంబంధించి విచారణ జరుగుతుండగానే, అదే కేసులో తనను అరెస్టు చేశారని ఆమె ప్రస్తావించారు. తనను అరెస్ట్ చేయబోమంటూ గతంలో సుప్రీంకోర్టుకి ఇడి అధికారులు వెల్లడించారని, సర్వోన్నత న్యాయస్థానానికి మాటిచ్చి తప్పారని తన పిటిషన్ లో తెలిపారు. దర్యాప్తు సంస్థ ఇడి కోర్టు ధిక్కరణకు పాల్పడిందని కవిత అన్నారు. ఇడిపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 19వ తేదీన ఆమె పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News