గాజా సిటీ: ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ (డబ్లుఎఫ్‌పి) ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడి జనాభాలో 70 శాతం మంది తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నట్టు తాజాగా అంచనా వేసింది. స్థానికంగా ప్రతి ఒక్కరూ సరిపడా ఆహారం కోసం ఇక్కట్లు పడుతున్నారని, ఉత్తర ప్రాంతంలో దాదాపు 2 లక్షల మంది విపత్కర ఆకలి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నట్టు తెలిపింది. ఒకవేళ ఇజ్రాయెల్ తన దాడులను రఫాకు విస్తరిస్తే మొత్తం 23 లక్షల జనాభాలో సగం మంది క్షుద్బాధకు లోనవుతారని హెచ్చరించింది. గాజా మొత్తం జనాభాలో నాలుగింట ఒకవంతు మంది (దాదాపు 6 లక్షలు) ఆకలితో అలమటిస్తున్నారని గత ఏడాది డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
మానవతా సాయాన్ని స్వీకరించేందుకు, పంపిణీ చేసేందుకు ఇజ్రాయెల్ ఆంక్షలు అడ్డంకిగా మారాయని స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తున్నాయి. శాంతి భద్రతలు దెబ్బతినడంతో గాజాలో ముఖ్యంగా ఉత్తరాదిలో సహాయక కార్యకలాపాలు అసాధ్యంగా మారాయని చెబుతున్నాయి. అయితే సాయం విషయంలో తాము ఎటువంటి పరిమితులు విధించలేదని టెల్‌అవీవ్ పేర్కొంది. మరోవైపు అమెరికా, జోర్డాన్, ఫ్రాన్స్ తదితర దేశాలు గాజాలో ఆహార పొట్లాలను జార విడుస్తున్నాయి.