Saturday, December 21, 2024

దానం నాగేందర్ అనర్హత వేటుపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

ఏక్‌నాథ్ షిండే కేసులో సుప్రీం కోర్టు తీర్పుతో
గతంలో మాదిరిగా జాప్యం చేసే పరిస్థితి లేదు
బిఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్‌లో చేరిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్ అనర్హత వేటుపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ తరపున ఎంఎల్‌ఎగా గెలిచిన దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బిఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, దేవిప్రసాద్, శశిధర్‌రెడ్డిలతో కలిసి వినోద్‌కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇటీవల సుప్రీంకోర్టు ప్రకటించిన తీర్పుతో గతంలో మాదిరిగా అనర్హత పిటిషన్‌పై స్పీకర్ జాప్యం చేసే పరిస్థితి పోయిందని చెప్పారు. మహారాష్ట్రలో శివసేనను వీడిన ఏక్ నాథ్ షిండే గ్రూప్ ఎంఎల్‌ఎల విషయంలో సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. మూడునెలల్లో నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర స్పీకర్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందని చెప్పారు. స్పీకర్‌కు కోర్టులు కాలపరిమితి విధిస్తున్నందున అనర్హత పిటిషన్‌పై ఇక వాయిదాలు కుదరవని తెలిపారు.
ఫిరాయింపులు ఏ పార్టీకి మంచివి కావు
దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటి నుంచే ఆయన శాసన సభా సభ్యత్వం రద్దయినట్టేనని చెప్పారు. స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకుని రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కాంగ్రెస్ దివంగత నేత రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నపుడే 1985లో రూపొందించారని అన్నారు. రాజీవ్ గాంధీ మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా కాంగ్రెస్ నేతలు ఫిరాయింపులు ప్రోత్సహించకూడదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో పార్టీ ఫిరాయింపులు ఏ పార్టీకి మంచివి కావు అని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ స్వల్ప తేడాతోనే అధికారానికి దూరమయ్యిందని, తమ పార్టీ తరపున 39 మంది ఎంఎల్‌ఎలు గెలిచామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి, అధికారపక్షానికి సమాన పాత్ర ఉంటుందని, కొన్నిసార్లు పార్టీలు ప్రతిపక్షంలో ఉండటం కూడా మంచిదే అని వ్యాఖ్యానించారు. ..బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఉద్యమ కారులే ప్రతిమ ముల్టీఫ్లెక్స్‌లో ఎన్నికల అధికారులకు దొరికింది తన బంధువుల డబ్బులు అని, ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. వాళ్ళు తనకు బంధువులు అయినంత మాత్రానా తనపై నిరాధార ఆరోపణలు చేస్తారా..? అని వినోద్‌కుమార్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News