చిత్తూరు: ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరించాడు… వివాహం చేసుకొని 24 గంటలు కాక ముందే మెడలోని తాళి తెంచేసి ప్రియురాలిని నడ్డురోడ్డు వదిలేసి వెళ్లిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం పాలేరు పంచాయతీ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. యమున(21), అభిరామ్(22) ఒకే కాలేజీలో చదువుకున్నారు. ప్రేమిస్తున్నానని యువతి వెంటపడ్డాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో చంపేస్తాను, చస్తానని పలుమార్లు బెదిరించాడు. అతడి బెదిరింపులకు బయపడి లొంగిపోయింది. మార్చి ఆరో తేదీన తమిళనాడులోని అరుణాచలం దేవాలయానికి తీసుకెళ్లి యమునను ప్రేమ వివాహం చేసుకున్నాడు.
తాను ప్రేమ వివాహం చేసుకున్నానని ఇంట్లో కుటుంబ సభ్యులకు అభిరామ్ చెప్పడంతో వారు ఒప్పుకోలేదు. చేసేదేమీ లేక యువతి మెడలో తాళి తెంచి చంపుతానని బెదిరించి ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని లాక్కొన్ని ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టాడు. మార్చి 7న అభిరామ్‌కు ఆమె ఫోన్ చేసి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇంట్లో వాళ్లకు సర్ది చెప్పి ఇంటికి తీసుకెళ్తానని కబురు పంపాడు. అప్పటి నుంచి అతడు రాకపోవడంతో ఫోన్ చేస్తే కట్ చేస్తుండడంతో మోసపోయానని గ్రహించింది. వెంటనే బంగారుపాళ్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.