ముంబై: ఐపిఎల్‌లో ట్రోఫీని సాధించే జట్టుకు భారీ నగదు నజరానా లభించనుంది. ప్రపంచంలో ఏ క్రికెట్ లీగ్‌లో లేనంత భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ ఐపిఎల్ ఛాంపియన్‌గా లభిస్తోంది. ఈసారి ట్రోఫీని సాధించే జట్టుకు రూ. 20 కోట్ల నగదు నజరానాను అందజేస్తారు. కిందటిసారి విజేతగా నిలిచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా రూ. 20 కోట్ల నగదు బహుమతిని అందుకుంది. ఈసారి కూడా విజేతగా నిలిచే టీమ్‌కు రూ.20 కోట్ల ప్రైజ్‌మనీ అందజేస్తారు.
రన్నరప్‌గా నిలిచే జట్టుకు రూ.13 కోట్లు దక్కుతాయి. ఇటీవల ముగిసిన మహిళల ఐపిఎల్‌లో ఛాంపియన్‌గా నిలిచిన బెంగళూరు జట్టుకు రూ.ఆరు కోట్ల నగదు బహుమతిని అందజేశారు. ప్రపంచంలో జరిగే ఇతర క్రికెట్ లీగ్‌లతో పోల్చితే ఐపిఎల్‌లోనే భారీ మొత్తంలో నగదు బహుమతి లభిస్తోంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ విజేతకు రూ.4.15 కోట్లు మాత్రమే లభిస్తాయి. ఐపిఎల్ తర్వాత అంతటి ఆదరణ కలిగిన ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్ విజేతకు రూ.3.66 కోట్ల నగదు బహుమతి మాత్రమే ఇస్తారు. కాగా, ఐపిఎల్ తర్వాత అత్యధిక ప్రైజ్‌మనీ సౌతాఫ్రికా టి20 లీగ్‌లో లభిస్తోంది. సౌతాఫ్రికా లీగ్‌లో విజేత టీమ్‌కు రూ.15 కోట్లు బహుమతిగా అందజేస్తారు.